పరీక్షలు రద్దు చేసి పాస్ అని సర్టిఫికెట్ ఇస్తే విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని.. విద్యార్థుల భవిష్యత్ గురించి.. తనకన్నా ఎక్కువ ఆలోచించేవారు ఉండరని .. ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వసతి దీవెన పథకం కింద నిధుల్ని మంజూరు చేసిన తర్వాత ఆయన పరీక్షలపై జరుగుతున్న రాజకీయంపై స్పందించారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో ఆన్నది రాష్ట్రాల నిర్ణయం అని.. అందుకే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయన్నారు.
పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే..కానీ విద్యార్థులకే నష్టమని.. విపత్కర పరిస్థితుల్లో అగ్గిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేవలం పాస్ సర్టిఫికెట్లు ఇస్తే మంచి విద్యా సంస్థల్లో సీట్లు ఎలా వస్తాయని సీఎం జగన్ ప్రశ్నించారు. అయితే విపక్ష పార్టీలు మాత్రం… దేశంలో 20 రాష్ట్రాలు.. అదీ కూడా 90 శాతం మంది విద్యార్థుల్ని రిప్రజెంట్ చేసే రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేశాయని.. అలాంటప్పుడు.. ఒక్క ఏపీలో పరీక్షలు నిర్వహిస్తే.. ఏపీ విద్యార్థులకు మార్కులు వచ్చాయని.. ఏపీ విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. వాస్తవానికి టెన్త్ పరీక్షల మార్కుల వెయిటేజీ చూసే విధానం ఇంకా రాలేదు. ఇంటర్ పరీక్షల మార్కులు మాత్రం జాతీయ స్థాయి ప్రాముఖ్యత ఉన్న… ఐఐటీ వంటి కాలేజీల్లో చేరడానికి వెయిటేజీ చూస్తారు.
అయితే.. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనందున.. ప్రత్యామ్నాయాన్ని చూసే అవకాశాలు ఉన్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్ కోసమే.. పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే… పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నామని విపక్షాలు అంటున్నాయి. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్‌కు ఏది మంచిదో మాత్రం ఏకాభిప్రాయం లేకుండా పోయింది.