కోరోనా కదం తొక్కుతున్న వేళ.. ఆసుపత్రిలో పడకలకు కరువొచ్చింది. చాలామంది రోగులు ఆసుపత్రిలో చోటు లేక.. చెట్టు కిందో, పుట్ట కిందో సేద తీరుతున్న దృశ్యం కలచి వేస్తోంది. ఇలాంటి క్లిష్టమైన దశలో… రామానాయుడు స్టూడియోస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోని ఐసొలేషన్ వార్డులుగా మార్చేసింది. ఇక నుంచి.. ఈ స్టూడియో కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులకు బసగా ఉండబోతోంది. ఇదో చక్కటి నిర్ణయం. హైదరాబాద్ లోనూ చాలా స్టూడియోలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ భూములతో కట్టుకున్నవే. ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి కూడా వాటి అవసరం ఏర్పడింది. ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వం నుంచి తీసుకుని, స్టూడియోలు కట్టుకుని, డబ్బులు సంపాదించుకున్న వాళ్లంతా ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. వాళ్లంతా.. ముందుకొచ్చి స్వచ్ఛందంగా తమ స్టూడియోల్ని కరోనా చికిత్స నిమిత్తం ఇస్తే సరి. లేదంటే.. త్వరలో ప్రభుత్వమే ఆయా స్టూడియోల్ని కొంతకాలం స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి రాకముందే… వాళ్లంతా మేల్కొంటే బాగుంటుంది.