గతేడాది ఐపీఎల్ లో చెన్నై టీమ్ ని చూసి అందరూ జాలి పడ్డారు. ఎలాంటి టీమ్ ఎలా అయిపోయింది? అంటూ నోరెళ్లబెట్టారు. పాయింట్ల పట్టికలో.. చివరి స్థానంలో ఉండడం… చెన్నైకి అదే కొత్త. వరుస ఓటములతో, ఎన్నో విమర్శలతో.. ధోనీ సేన నిష్కృమించింది. చెన్నై జట్టులో వయసు మళ్లిన వాళ్లు ఎక్కువయ్యారని, ఎవరూ ఫిట్ గా లేరని, ముసలి టీమ్ అని.. చాలా కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు అదే టీమ్ తో.. ధోనీ మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో చెన్నై మళ్లీ తన హవా చూపించడం మొదలెట్టింది. తొలి ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 5 గెలుపులూ… వన్ సైడే. ఈ ఐపీఎల్ లో చెన్నై దూకుడు చూసి సీఎస్కె అభిమానులు పొంగిపోతున్నారు. ధోనీ ఫ్యాన్స్ సంగతి చెప్పక్కర్లెద్దు.
ఈసారి చెన్నై దృక్పథం కొత్తగా కనిపిస్తోంది. డూప్లెసిస్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి జోడీగా వస్తున్న గైక్వాడ్ ప్రతీ మ్యాచ్‌లోనూ చెలరేగిపోతున్నాడు. గత ఐపీఎల్లో రైనా లేడు. ఈసారి మాత్రం తనెంత విలువైన ఆటగాడో.. చెన్నై టీమ్ కి మరింత బాగా అర్థమయ్యేలా ఆడుతున్నాడు. జడేజా సంగతి చెప్పాల్సిన పని లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో… తన మాస్టర్ క్లాస్ చూపిస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులు సాధించి తన విశ్వరూపం చూపించాడు. టీమ్ కి భారమైన బ్రావోని ఈసారి చెన్నై పక్కన పెట్టేసింది. అతని స్థానంలో.. మొయిన్ అలీని తీసుకోవడం మంచి ఎత్తుగడ. ఫామ్ లో లేకపోతే ఎంతటి ఆటగాడినైనా పక్కన పెడతామన్న సంకేతాల్ని చెన్నై ఇవ్వగలిగింది. పైగా… గత సీజన్లో ఓటమి.. చెన్నైకి కొత్త పాఠాలు నేర్పించింది. తాము విజేతలమే అయినా.. గెలుపు ఎప్పుడూ నల్లేరుపై నడక కాదన్న విషయం చెన్నైకి తెలిసొచ్చింది. స్టార్ ప్లేయర్లుఉంటే సరిపోదని, వాళ్ల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టాలన్న నిజం తెలుసుకుంది. అందుకే ఇప్పుడు ఆటగాళ్లంతా ఒళ్లొంచుతున్నారు. ఫలితమే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. ఈ జోరు… చెన్నై మున్ముందూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.