కేంద్ర ఎన్నికల సంఘం మీద మద్రాస్ హైకోర్టు ఎలా విరుచుకుపడింతో.. తెలంగాణ ఎస్ఈసీ మీద.. తెలంగాణ హైకోర్టు అదే రేంజ్లో విరుచుకుపడింది. ఆకాశంలో ఉన్నారా.. భూమి మీద ఉన్నారా అని సూటిగా ప్రశ్నించింది. దీనికి కారణం.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తూండటమే. కరోనా కేసులు తెలంగాణలో పెరిగిపోతూండటం… పెద్దగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో పట్టుదలగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా… పరిస్థితులు బాగోలేవని తెలిసినా ఎన్నికలకే మొగ్గు చూపింది. చివరికి గవర్నర్ జోక్యం చేసుకుని ఎస్ఈసీతో మాట్లాడినా ఎన్నికల వాయిదాకు సుముఖత చూపలేదు. ముఫ్పయ్యో తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో … ఒక్క రోజు ముందుగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. ప్రభుత్వం పెట్టమంటేనే పెడుతున్నామంటూ..ఎస్ఈసీ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలను తెలంగాణ హైకోర్టు కూడా ఎస్ఈసీపై చేసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని సూటిగా ప్రశ్నించింది. అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
ప్రభుత్వంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించడంతో ప్రభుత్వ లాయర్లు నీళ్లు నమలాల్సి వచ్చింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని.. ఒక రోజు ముందు కట్టడి చర్యలు ప్రకటిస్తే నష్టమేంటని ప్రశ్నించింది. హైకోర్టు కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ను ఎప్పటికప్పుడు నిలదీస్తోంది.కానీ.. ప్రభుత్వం మాత్రం.. నింపాదిగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వంతో పాటు.. ఎస్ఈసీ కూడా.. ఇరుక్కుపోయింది.