టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం.. ఏపీలో విపక్ష పార్టీలన్నీ పోరాడుతున్నాయి. అయితే వారితో పాటు ఈ సారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా.. ఉద్యమంలో చేరారు. ఆయన స్వతంత్రంగా తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. మొదటగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని.. రెండు నెలల పాటు వాయిదా వేయకపోతే.. చిన్న పిల్లలు తీవ్రంగా నష్టపోతారని ఆయన దీక్షకు కూడా కూర్చున్నారు. ఇటీవలి కాలంలో ఆయన అమెరికాకే పరిమితం అయ్యారు.
అక్కడ్నుంచే .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. అయితే దాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.. వేరే విషయం. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటానంటూ ఇండియాకు వచ్చారు కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారు పాల్‌ను పట్టించుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి.. తాను పోరాటం చేయనని ప్రకటించారు. ఇప్పుడు టెన్త్ పరీక్షల రద్దు కోసం రంగంలోకి దిగారు. ఆయనను అందరూ కామెడీగానే తీసుకుంటున్నారు కానీ.. పాల్ మాత్రం.. సీరియస్‌గా తన ప్రయత్నాలు చేస్తున్నారు.
అందరూ ఎగతాళి చేసినా.. ఆయన మాత్రం పట్టుదలగా పని చేసుకుంటున్నారు. మళ్లీ అమెరికా వెళ్లే వరకూ ఆయన సీరియస్‌గానే ఇక్కడ రాజకీయం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఆయన వేసే పిటిషన్లు ఎప్పుడైనా సంచలనాత్మక తీర్పులకు కారణం అయితే.. అప్పుడు ఆయన సీరియస్ నెస్ ప్రజలకు.. పార్టీలకు అర్థం అవుతుంది. లేకపోతే.. కామెడీనే అయ్యే అవకాశం ఉంది.