ప్రైవేటు కంపెనీకి ఏపీలో ఇసుకను ధారదత్తం చేసి చాలా కాలం అయింది. కానీ ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదు. మే ఒకటో తేదీ నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు చేపడుతుందని చెప్పి.. గతంలో… ఇసుక ర్యాంపుల్లో పనిచేయడానికి నియమించుకున్న పదిహేను వందల మందికిపైగా ఉద్యోగుల్ని తీసేశారు. మే ఒకటో తేదీ నుంచి మీరెవరూ పనిలోకి రావాల్సిన పని లేదని చెబుతూ…ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదిహేను వందల మంది … రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ అనే ధర్డ్ పార్టీ కంపెనీతరపున ఉద్యోగులుగా ఉన్నారు. దీంతో వారంతా వేరే ఉద్యోగాలు వెదుక్కునేపనిలో ఉన్నారు.
అయితే ఇసుకను కైవసం చేసుకున్న కంపెనీ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు రాలేదు. దీంతో.. మరోసారి రెడ్డిస్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇచ్చిన టెర్మినేషన్ ఉత్తర్వులను వాయిదా వేసుకుంది. ఆ పదిహేను వందల మంది ఉద్యోగంలో కొనసాగవచ్చనిప్రభుత్వం చెప్పింది. అయితే ఇది శాశ్వతం కాదు. నెల మాత్రమే. వచ్చే నెల నుంచి ఇసుకను పొందిన కంపెనీ.. తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఓ వైపు ఇసుక విధానంపై టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఒకరికే ఇసుకను కట్టబెట్టడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఇసుకను కైవసం చేసుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్ వైసీపీ నేతల బినామీ అని.. టోకుగా… రాష్ట్రసంపదను దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో… ఆ కంపెనీ కార్యకలాపాలు.. ఆలస్యమవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. రేట్లను ప్రభుత్వమే డిసైడ్ చేయనుంది. అయితే ఇప్పుడు అమ్ముతున్న రేట్ల కన్నా ఎక్కువకే అమ్మబోతున్నారు. దీంతో మరోసారి రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో లభ్యత కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. మొత్తానికి ఇసుక విషయంలో ప్రభుత్వం మరో పాలసీతో ప్రయోగం చేస్తోంది. తేడా వస్తే.. ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది.