అనంతపురం కోవిడ్ ఆస్పత్రి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. దీనికి కారణం అక్కడ అత్యధిక మరణాలు చోటు చేసుకోలేదు.. అత్యధిక మందికి ట్రీట్ మెంట్ ఇవ్వడం కాదు… అసలు అక్కడ ఆస్పత్రి లేకపోవడమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో ఎక్కడా ఆస్పత్రుల్లో ఖాళీ లేదు. బెడ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. గతంలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ఆస్పత్రి ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ” అనంతపురం జిల్లాలో 1500 పడకల కరోనా ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గూగుల్ వెతికి చూడండి.. పచ్చ తమ్ముళ్లూ.. ఇంకెక్కడైనా ఇంత వేగంగా, సకల సౌకర్యాలతో తాత్కాలిక హాస్పిటల్ తయారైందేమో, ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సీఎం ఉండటం రాష్ట్ర అదృష్టం” ఇదీ గత ఏడాది జూలై 21వ తేదీన విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్. ఆ ఆస్పత్రి ఇంత వరకూ కట్టలేదు. అసలు పెట్టలేదు.
దానికో పెద్ద కథ ఉంది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద గత ప్రభుత్వం భారీ పౌరసరఫరాల గోడౌన్ నిర్మింంచింది. అందులో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కరోనా మొదటి వేవ్ సమయంలో నిర్ణయించారు. ముందుగా రంగులేసేశారు. రూ.8.5 కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రి పెట్టేస్తున్నామని బాకా ప్రారంభించారు. పనులు ప్రారంభించారు. కానీ ఎంత వేగంగా ప్రారంభించారో.. అంతే వేగంగా అంటే రంగులతోనే ఆగిపోయింది. ఆ ఆస్పత్రిలో బెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. గోదాములో ఉన్న 12 బ్లాకుల్లో ఒక్కో బ్లాకులో 125 పడకలు .. ప్రత్యేకంగా మహిళలకు రెండు విభాగాల ఏర్పాటు చేస్తామని డప్పుకొట్టారు. గోడౌన్ ఆవరణలో 200 మరుగుదొడ్లతోపాటు నీటి సంపుల పనులు ప్రారంభించారు. అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి.
కారణం అసలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతే ఇవ్వలేదు. పరిపాలనా పరమైన అనుమతులుగానీ, వర్క్ ఆర్డర్లుగానీ లేవు. లేకుండానే వైసీపీ నేతలు సొంత పెత్తనం తీసుకుని ప్రకటనలు చేసేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలోని ఇతర వైసీపీ నేతలు కాంట్రాక్టులు తీసుకుని పనులు కూడా ప్రారంభించేశారు. ఈ విషయం తెలిసో లేదో కానీ విజయసాయిరెడ్డి, సలహాదారు రాజీవ్ కృష్ణ లాంటి వాళ్లు డప్పు కొట్టుకున్నారు. ఇంత ప్రచారం చేసినా ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అనుకుందో..లేకపోతే.. అనవసరం అనుకుందో కానీ.. అనుమతి ఇవ్వలేదు. దాంతో పనులు అక్కడే ఆగిపోయాయి.
అయితే.. అనుమతులు లేకుండా పనులు ఎలా ప్రారంభించార్నది ఓ మిస్టరీ అయితే.. ఇప్పుడు ఆ పనుల వల్ల సివిల్ సప్లయ్ గోడౌన్లో పనికి రాకుండా పోయింది. ఫ్లోరింగ్ పూర్తిస్థాయిలో దెబ్బతింది. పైప్ ఫిట్టింగ్ కోసం ఎక్కడపడితే అక్కడ గోడలకు రంధ్రాలు ఏర్పాటు చేశారు. రూ.14 కోట్ల వ్యయంతో గోడౌన్ను నిర్మించారు. ఇప్పుడు ఇది కూడా వృధా అయిపోయింది. పనికి మాలినోడు పందిరేస్తే పిచ్చుక వాలగానే కూలిపోయిందన్నట్లుగా ఆ గోడౌన్ పరిస్థితి మారింది.