టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో పట్టుదలగా ముందుకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనల చేసింది. పరీక్షల విషయంలో పునం పరిశీలించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో … పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ.. కొంత మంది విద్యార్థులు.. తల్లిదండ్రులతో పాటు టీడీపీ నేతలు కూడా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. దాదాపుగా ముఫ్పై లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం అవుతారని గుర్తు చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇది ప్రమాదకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. కరోనా వచ్చిన వారు పరీక్షలుఎలా రాయగలుగుతారని.. హైకోర్టు ప్రశ్నించినప్పుడు… వారికి విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలు.. పరీక్షల్ని వాయిదా వేసినప్పుడు ఇక్కడ మాత్రం వాయిదా వేయడానికి ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మూడో తేదీకి వాయిదా వేస్తున్నామని ప్రభుత్వ అభిప్రాయం అప్పటికి చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి భిన్నం. ఆయన ఎవరు చెప్పినా వినరు. తాను ఏదనుకుంటే అది చేయాలనుకుంటారని చెబుతూంటారు. అందుకే వివిధ వర్గాల నుంచి పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ వచ్చినప్పటికి.. ఆయన ముందుకే వెళ్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాను ఆలోచించినట్లుగా ఎవరూ ఆలోచించరని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటల్ని బట్టి ఆయన పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు.. మళ్లీ పరిశీలన చేయాల్సి ఉంటుంది.
అయితే గతంలో కోర్టు చెప్పిన అనేక అంశాలను ప్రభుత్వం లైట్ తీసుకుంది. తాను చేయాలనుకున్నది చేసింది. ఇప్పుడు.. హైకోర్టు.. పరిశీలించమన్నది కాబట్టి… తాము తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించే అవకాశం లేదని కొంత మంది చెబుతున్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసేశామని.. ఈ దశలో.. పరీక్షల్ని ఆపే ఉద్దేశం లేదని … కాకపోతే… విద్యార్థులు.. వారి తల్లిదండ్రులకు సంబంధించి.. పూర్తిగా కరోనా జాగ్రత్తలు తీసుకున్నామని వాదించేఅవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో దాదాపుగా రోజువారీగా పదిహేను వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ సీరియస్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని.,. కోర్టును గౌరవించి.. పరీక్షల్ని వాయిదా వేసే చాన్స్ కూడా ఉందన్నప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందనేది.. మూడో తేదీన స్పష్టం కానుంది.