పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని గట్టిగా సూచిస్తే.. మే మూడో తేదీలోపు ఏ విషయం చెప్పాలని..ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలిచ్చిన కాసేపటికే.. అధికారికంగా విద్యా శాఖపై సమీక్ష చేసిన సీఎం జగన్.. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సంకేతాలు పంపారు. దీంతో .. హైకోర్టు సూచనలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదనే దానికి బలమైన సంకేతాలు వచ్చినట్లయింది. విద్యార్థుల భవిష్యత్ కోసమే.. టెన్త్, ఇంటర్ పరీక్షల్ని నిర్వహిస్తున్నామని… ఏ పరిస్థితిలో, ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది ప్రజలకు చెప్పాలని ఆయన అధికారులు.. మంత్రులను ఆదేశించారు. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని.. అలా ఇస్తే విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు.
కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తు చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని.. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయన్నారు. ఏపీలో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి…మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటి అని జగన్ ప్రశ్నించారు.
విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలని.. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో… ఎప్పటిలాగే… హైకోర్టు ఆదేశాలను కన్నా… తన సొంత పట్టుదలనే ప్రామాణికంగా తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మూడో తేదీన పరీక్షలు పెడతామనే హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది. హైకోర్టు స్పందన కీలకంగా మారనుంది.