కెమెరామెన్, దర్శకుడు కెవి ఆనంద్ మృతి… చిత్రసీమని కలిచివేస్తోంది. ఆయనతో పనిచేసినవాళ్లంతా.. కన్నీరు మున్నీరు అవుతున్నారు. సూర్య అయితే.. ఆప్తుడ్ని కోల్పోయిన బాధలో ఉన్నారు. శంకర్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. మహేష్ కూడా ట్విట్టర్లో ఆనంద్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశాడు. నిజానికి మహేష్ – కెవి ఆనంద్ కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. `రంగం` తరవాత.. ఈ కాంబో సెట్ అవ్వాల్సింది. మహేష్ కూడా కెవి ఆనంద్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. అయితే కొన్ని సమీకరణాల వల్ల.. ఈ కాంబో సాధ్యం కాలేదు. `రంగం` తరవాత మహేష్ కోసం ఓ స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో పడ్డాడు ఆనంద్. అయితే వెంటనే.. సూర్య పిలిచి డేట్లు ఇచ్చాడు. దాంతో `మాత్రన్` సినిమా పట్టాలెక్కింది. కేవలం సూర్యని కాదనలేక… ఆ సినిమా చేశాడు ఆనంద్. నిజానికి ఆ సమయంలో మహేష్ తో ఆనంద్ పనిచేయాల్సివుంది. 2014లో మళ్లీ కాంబో సెట్ అవ్వాల్సింది. అప్పుడే మహేష్ `ఆగడు` లాంటి డిజాస్టర్ చూశాడు. ఆ సమయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.. ఆనంద్ ప్రతిపాదన పక్కన పెట్టాల్సివచ్చింది. అలా.. మహేష్ తో సినిమా చేయాలన్న కల.. ఆనంద్కు తీరకుండా పోయింది.