తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అక్రమాలు జరిగాయని… పోలింగ్‌ను రద్దు చేయాలంటూ… టీడీపీ, బీజేపీ అభ్యర్థులు దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. అయితే కీలకమైన వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. అక్రమాలు జరిగాయని ఆధారాలు సమర్పించారు కానీ… ఎలక్షన్ పిటిషన్‌కు అవకాశం ఉందని.. అందుకే తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. తిరుపతి ఉపఎన్నికల్లో లక్షల కొద్దీ దొంగ ఓటర్లు ఓట్లు వేశారని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పిటిషన్లు వేశారు. దానికి తగ్గట్లుగా ఆధారాలు సమర్పించారు.
రెండు విడతలుగా విచారణ జరిపిన హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలనిసూచిస్తూ కొట్టి వేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో కూడిన పన్నెండుపేజీల లేఖను పంపారు. అయితే.. రిటర్నింగ్ అధికారి.. మైక్రో అబ్జర్వర్లు ఎలాంటి నివేదికలు ఇచ్చారో కానీ.. కేంద్ర ఎన్నికల సంఘం… వెల్లువలా వచ్చిన ఫిర్యాదులపై కనీస స్పందన కూడా తెలియచేయలేదు. దీంతో కనీసం తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో అయినా రీపోలింగ్ జరపాలన్న విపక్షాల అభ్యర్థనలను తోసి పుచ్చినట్లయింది. ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది.
ఈ సమయంలో… పనబాక లక్ష్మి అయినా… రత్నప్రభ అయినా.. ఎలక్షన్ పిటిషన్ వేసి.. ఫలితం సాధించే పరిస్థితి ఉండదు. దీంతో తిరుపతి ఉపఎన్నిక ఫలితంపై.. దొంగ ఓట్ల ఆరోపణలు ఓ మచ్చలా ఉండిపోతాయి. వైసీపీకి భారీ మెజార్టీ వచ్చినా.. అవి దొంగ ఓట్ల వల్ల వచ్చాయన్న విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.