భూకబ్జా దారుడు అంటూ కొన్ని చానల్స్‌లో విస్తృతంగా జరిగిన ప్రచారంపై మంత్రి ఈటల రాజేందర్ ఓపెన్ సవాల్ విసిరారు. తన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని.. ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉంటే అన్నింటితోనూ విచారణ చేయించాలి… సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణల సంగతి నిగ్గు తేలిన తర్వాతనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై ఈటల పూర్తి వివరణ ఇచ్చారు. మెదక్ జిల్లాలో నాలుగేళ్ల కిందట హేచరీస్ స్థాపించామని.. దాని కోసం కెనరా బ్యాంక్ వద్ద రూ. వంద కోట్లు రుణం తీసుకున్నామన్నారు. తర్వాత పౌల్ట్రిని విస్తరించడానికి భూముల కోసం ప్రయత్నించినా చుట్టూ అసైన్డ్ ల్యాండ్సే ఉన్నాయన్నారు. ఆ అసైన్డ్ ల్యాండ్స్ నేరుగా తీసుకోవడానికి అవకాశం లేనందున … వారు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే పరిశ్రమల శాఖ ద్వారా కేటాయించుకోవచ్చని భావించినట్లుగా చెప్పారు. అయితే అలా జరగలేదని చెప్పారు. ఇప్పుడు వారు చెబుతున్న భూముల్లో ఒక్క ఎకరం కూడా తన స్వాధీనంలో లేదని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ఈటల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీలోనే కుట్ర చేస్తున్నారని ఎక్కడా మాట జారలేదు. అయితే తాను దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినని చెప్పుకోవడం ద్వారా.. పరోక్షంగా తానువెనక్కి తగ్గనని హింట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తన ఆత్మగౌరవంపై దెబ్బకొడితే సహించే ప్రశ్నే లేదన్నారు. అలాగే తన ఆస్తుల గురించి విచారణకు సవాల్ చేసే సమయంలో స్కూటర్‌పై తిరిగే వాళ్లు.. ఒక్క జనరేషన్లోనే వందల కోట్లు ఎలా సంపాదించారో … అందరి చరిత్రలూ తెలుసని ప్రకటించారు.
ఓ వర్గం మీడియాలో తనపై మూకుమ్మడిగా ఒకే రకమైన కథనాలు రావడంపై ఈటల మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని కుట్రతో దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ చానళ్లన్నింటినీ పెయిడ్ మీడియాగా అభివర్ణించారు. తాను నయీం లాంటి వాడికే భయపడలేదని.. ఇప్పుడు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన కులంపై వస్తున్న విమర్శలను కూడా ఈటల ప్రస్తావించారు. తాను ముదిరాజ్ బిడ్డనని.. తన భార్య రెడ్డి అయితే.. తన కుమారుడికి కూడా రెడ్డి అని పెట్టుకున్నామన్నారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.