బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసేశాదాకా ప్రభుత్వం నిద్ర పోయేట్లుగా లేదు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. . సంస్థను మూసివేయాలంటూ.. ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత వారం.. కడప జిల్లాలో అతి పెద్ద సిమెంట్ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న జువారిప్లాంట్ను మూసేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే కరెంట్ కూడా నిలిపివేశారు. ఆ సంస్థ సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందేమో బయటకు రాలేదు కానీ.. అధికారిక ప్రకటన చేస్తామని.. తర్వాత స్పందించలేదు. ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది.
అమరరాజా కంపెనీ.. అమరాన్ బ్రాండ్‌తో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. చిత్తూరు జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చిన సంస్థ అమరరాజా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన భూములంటూ కొన్నింటిని వెనక్కి తీసుకునేందుకు జీవో ఇచ్చింది. అయితే కోర్టులో నిలబడలేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ పేరుతో.. ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అమరరాజా కూడా స్పందించింది. తాము అన్ని రకాల పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని…వాటిపై తగినంత పెట్టుబడులు పెట్టామని కూడా వివరణ ఇచ్చింది.
అయితే కొన్నాళ్లుగా అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న విధానం చూస్తే…. అసలు కారణాలు వేరే అని అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటివి రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తాయని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదు. పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న వాటిని కూడా… రాజకీయ కారణాలతో తరిమేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.