బ్లాక్ మెయిల్ చేస్తారు..! ఇష్టం వచ్చినట్లుగా బురద చల్లుతారు..! అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి వెనుకాడరు..! వారు ఇచ్చే సాక్ష్యాల్ని పట్టించుకోరు..!. వారిపై అనుచితమైన వ్యాఖ్యలతో రిపోర్టింగ్ చేస్తారు..!.. ఇదీ ఇప్పుడు తెలంగాణ మీడియా స్టైల్. తమ రాజకీయ బాసులు ఎవరిని టార్గెట్ చేయమంటే వారిపై “కుక్కల్లా” ఎగబడటం ఇప్పుడు మీడియా మాఫియాకు కామన్ అయిపోయింది. “కుక్కల్లా ఎగబడటం ..” అనే పదం వాడటం బాధగానే ఉన్నా… ఇప్పుడు… ఓ వర్గం మీడియా చేస్తున్న మాఫియా పనులకు ఇంత కంటే గౌరవప్రదమైన పదం దొరకడం లేదు.
ఈటలపై అంత ఏకపక్ష దాడి చేయాల్సిన అవసరం ఏంటి..?
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఉద్యమకారుడు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడంలో ఆయన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. తెలంగాణపై పాదం పెట్టి తొక్కుతున్న వైఎస్ లాంటి లీడర్ని ఎదుర్కొని ఉద్యమానికి ఊపిరి నిలిపారు. ఆయనపై ఇప్పటి వరకూ ఎలాంటి ఆరోపణలు లేవు. ఆయనకు సమాజంలో ఓ ఇమేజ్ ఉంది. వ్యక్తిత్వం ఉంది. అలాంటిది ఆయనపై .. కొంత మంది ఉస్కో అనగానే ఓ వర్గం టీవీ చానళ్లు విరుచుకుపడ్డాయి. మీడియాకు ఉండాల్సిన సహజ లక్షణాలు అయిన.. కనీస పరిశోధన లేదు.. ఆరోపణలు వచ్చిన వ్యక్తి నుంచి వివరణ లేదు.. కానీ.. కబ్జాల మంత్రి అంటూ… తీర్పులిచ్చేసి ప్రసారాలు ప్రారంభించేశారు. ఏకపక్షంగా.. ఏకవాక్యంతో సంబోధిస్తూ.. ఈటలను మానసికంగా చంపేయాలన్న కసితో కథనాలు రాశారు. యాంకర్లతో పలికించారు. చివరికి ప్రెస్మీట్ పెట్టి.. ఈటల తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా.. వాటిని ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నారు. తన అధీనంలో ఒక్క ఎకరం అసైన్డ్ భూమి కూడా లేదని ఈటల చెప్పిన తర్వాత అది అబద్దమని..నిరూపించగలిగిన తర్వాత మీడియా వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అదేమీ పట్టించుకోలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి మీడియా అనే పేరు తగిలించుకున్న మాఫియా … దిగజారిపోయింది.
రియల్ ఎస్టేట్ బ్లాక్మెయిల్స్ నుంచి రాజకీయకుట్రల కేంద్రాలుగా మీడియా మాఫియా..!
ఒక్క ఈటల విషషయంలోనే కాదు.. ఇటీవలి కాలంలో తెలంగాణ మీడియా… పూర్తి స్థాయి మాఫియాగా రూపాంతరం చెందింది. తమ యజమానుల వ్యాపార ప్రయోజనాలు రక్షించడం కోసం.. పోటీ సంస్థలపై అడ్డగోలు బరద చల్లడానికి కూడా ఏ మాత్రం సంకోచించని దౌర్భాగ్యం దాపురించింది. తమ యజమానులతో ఎవరైనా వివాదంలో ఉంటే… వారిపై తప్పుడు కథనాలు రాసి.. తిట్లు లంకించుకునే దారుణం కూడా మీడియా మాఫియాలో చోటు చేసుకుంటోంది. ఈ మీడియా మాఫియా అరాచకం ఏ స్థాయిలో ఉంటోంది అంటే..కొద్ది రోజుల క్రితం… విశాఖలో ఓ టీడీపీ నేత భవనాన్ని కూల్చేశారు. ఆయన ప్రైవేటు స్థలంలో కట్టుకుంటున్న ఆ భవనాన్ని సెట్ బ్యాక్ వదలలేదంటూ కూల్చేశారు. ఆ విషయం అక్కడి అధికారులే చెప్పారు. కానీ.. మీడియా మాఫియా మరింత అత్యుత్సాహానికి పోయింది. అది ప్రభుత్వ స్థలమని.. అందుకే కూల్చేశారని.. అక్రమాలన్నీ తేలిపోతున్నాయని రాసుకొచ్చారు. మీడియా పేరుతో ఇలా దౌర్భాగ్యమైన కథనాలు రాసి.. ప్రజల్లో మాఫియా అనే బిరుదును నిజం చేసుకుంటున్నారు.
యజమానులు ఉస్కో అనడమే తరువాయి.. కరవడమే..!
తెలుగు మీడియా ఇప్పుడు తెలంగాణ మీడియాగా మారింది. ప్రధాన టీవీ చానళ్లన్నీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు వారి అవసరాలు.. రాజకీయాల కోసం మాఫియాగా మారిపోయాయి. ఎదుటి వారు ఎవరు అన్నది ముఖ్యం కాదు.. వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి దేనికైనా వెనుకాడని ఓ అరాచక మనస్థత్వం మీడియాకు వచ్చింది. అంతా తప్పని తెలిసిన తర్వాత… తాము చేసిన ప్రసారాల వల్ల వారికి ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి కూడాచాన్స్ ఉండదు. కనీసం.. సవరణ.. వివరణ చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఈ మాఫియా పని బురద చల్లడమే. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోదాల పేరుతో రేవంత్ రెడ్డిని మూడు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చే్సి.. ఆ మూడు రోజుల పాటు ఫేక్ డాక్యుమెంట్లతో చేయాల్సినంత తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా రేవంత్ రెడ్డి ఎంతో నష్టపోయారు. వాటిపై వివరణ ఇవ్వాలని ఆయన తర్వాత లీగల్ నోటీసులు కూడా పంపారు. కానీ.. ఈ మాఫియా స్పందించలేదు.
ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చిన కబ్జా కథలు కనిపించలేదా..!?
నిజంగా మీడియా అక్రమాలపై స్పందించింది అని సరిపెట్టుకుందామంటే… అసలు మనసొప్పని పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే… మేయర్గా ఉన్నప్పుడు బొంత రామ్మోహన్ అనే నేత… చేసిన కబ్జా బాగోతం… పక్కా ఆధారాలతో బయటకు వచ్చింది. దెబ్బకు ఆయన భూమిని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. కానీ.. ఈ ఘనత వహించిన మీడియా మాఫియా కిక్కురుమనలేదు. ఓ యువనేత ఫామ్ హౌస్… పర్యావరణ నిబంధనల ఉల్లంఘన అంటూ… పక్కా ఆధారాలతో ఎన్జీటీకి ఫిర్యాదు చేసినా.. ఆ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించినా ఈ మీడియా మాఫియాకు కనిపించలేదు. ఎందుకంటే.. వారు అస్మదీయులు.. తమ యజమానులు. అందుకే మాఫియా అనేది.
తన నెత్తి మీద తన చేయి పెట్టుకుంటున్న మీడియా..!
రాజకీయ కుట్రలను మీడియా సాయంతో చేయాలనుకోవడం.. ఎల్లకాలం సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే.. ప్రజల విశ్వాసం .. వారు నమ్మినంత కాలం మాత్రమే ఏ వ్యవస్థ అయినా నిలబడుతుంది. మీడియా విషయంలో అది మరీ ముఖ్యం. ప్రజల విశ్వసనీయతే … మీడియాకు పునాది. అది కోల్పోయిన రోజున.. ఆ సంస్థలన్నీ కుప్పకూలిపోతాయి. ప్రస్తుతం తెలుగు మీడియాలో చొరబడిన మాఫియా ధోరణులు.. కుట్రలు చేసి.. ఇతరుల వ్యక్తిత్వాలపై నిందలేయడం.. రాజకీయ ప్రయోజనాలు సాధించడం వంటివి కొంత కాలం నడవొచ్చు..కానీ ప్రజల నమ్మకాన్ని ఆ మీడియా శాశ్వతంగా కోల్పోతుంది. చివరికి నిజం చెప్పినా నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది.