ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ టైమ్స్‌నౌలో కల్లోలం రేగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మే రెండో తేదీన ఎన్నికల కవరేజీని సస్పెండ్ చేస్తున్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది. కరోనా అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లుగా టైమ్స్ నౌ చేసిన ట్వీట్లో వెల్లడించింది. అయితే.. కరోనాపై దృష్టి పెట్టడానికి ఎన్నికల కవరేజీని బహిష్కరించాల్సిన అవసరం ఏమిటో .. మీడియాలోని ఇతర వర్గాలకు పెద్దగా అర్థం కావడం లేదు. కానీ… టైమ్స్‌నౌలో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడిందన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. మూడు నాలుగు రోజుల కిందట… ఆ చానల్‌కు చెందిన జర్నలిస్టులు… ఎడిటర్స్‌కు సంచలనాత్మక లేఖ రాశారు. మీడియా చానల్‌గా ప్రజల కోసం కాకుండా బీజేపీ కోసం పని చేస్తోందని ఆ లేఖలో విమర్శించారు.
జర్నలిస్టులుగా మన చుట్టూ ఏం జరుగుతోందో మనకు తెలుసు. కరోనా దుర్భర పరిస్థితులు కళ్ల ముందే ఉన్నాయి. బెడ్ కోసం వీధుల్లో, అంబులెన్సుల్లో పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు కొందరు ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్నారు. కొందరు నిర్భాగ్యులు కన్నుమూస్తున్నారు. ప్రాణాధార ఔషదాలు దొరకడం లేదు. మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. అయినప్పటికీ.. ప్రతిపక్షాలనే నిందిస్తున్నాం. అసలైన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాం,, హిందూ ముస్లిం విభేదాలు పెంచే చర్చలు నడుపుతున్నామని వారు ఆ లేఖలో నిలదీశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్దపెద్ద ర్యాలీలు నిర్వహించే ప్రతిపక్ష నేతల వీడియోలు చూపిస్తాం. అదే పని చేస్తున్న అమిత్ షా ఫొటో కూడా చూపించం. అంత వెన్నెముక లేకుండా తయారయ్యామని లేఖలో మండిపడ్డారు
మీ ముందున్న ప్రశ్న చాలా చిన్నది. ప్రజల పక్షాన నిలుచోవాలా? లేక బిజెపి పక్షాన నిలుచోవాలా? బిజెపి పక్షాన నిల్చోవడం అంటే మీరు మీ వృత్తి ధర్మానికే కాదు.. ఈ దేశానికే ద్రోహం చేస్తున్నట్లు. అని లేఖలో తేల్చి చెప్పారు. ఈ లేఖ టైమ్స్ నౌలో సంచలనాత్మకం అవుతోంది. ఇప్పుడు ఎలక్షన్ కవరేజీని కరోనా కారణంగా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ.. కరోనా కారణం కాదని.. ఆ లేఖ ద్వారా ఏర్పడిన సంక్షోభం వల్లనే… ఎలక్షన్ కవరేజీని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు.