ప్రస్తుతం తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈటెల రాజేందర్ అవినీతి కి తగిన శిక్ష పడాలని ఒక వర్గం వాదిస్తూ ఉంటే, ఇదంతా కెసిఆర్ రాజకీయ ఎజెండా అని, బిసి నేత అయిన ఈటెల ను బలిపశువును చేస్తున్నారని మరొక వర్గం వారు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్ షర్మిల ఈటెల రాజేందర్ వ్యవహారం పై ట్వీట్ చేస్తూ, “ఎవరు అవినీతి చేసినా వారికి శిక్ష పడాల్సిందే, ఈటెల అవినీతి పై మీ ఎంక్వైరీని స్వాగతిస్తున్న .. అయ్యా KCR దొరగారు .. ఇది పొమ్మనలేక పొగ పెట్టడమా .. లేక .. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని .. వాళ్ళ పదవికి ఏసరు పెట్టడమా? ఈ రోజు ఈటెల పై 10 మంది కంప్లైంట్ చేయగానే 10 నిమిషాల్లో స్పందించి ఎంక్వైరీకి ఆదేశించిన మీరు, అన్యాయం జరుగుతుంది చంద్రశేఖరా ..అని మంత్రి మల్లారెడ్డి పై, MLA ముత్తిరెడ్డి పై ఆరోపణలు చేసినప్పుడు.. మా భూములను MLA సైదిరెడ్డి కబ్జా చేసిండని జనం మోత్తుకొన్నప్పుడు మీకు వినిపించలేదా? మీకు సలాంలు కొట్టి .. గులాంగిరి చేసే వాళ్లకు ఏ ఆపద ఉండదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే .. అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న మీ పార్టీ ప్రతినిధులపై కూడా ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నం.” అని రాసుకొచ్చారు.
అయితే షర్మిల వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అవినీతి చేసిన వారికి ఎంతటివారైనా శిక్ష పడాలని షర్మిల వ్యాఖ్యానించడం మంచి కామెడీ అని, తమ ఇంట్లో ఇదే అవినీతి ఆరోపణలపై వైయస్ జగన్ కేసును ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద షర్మిల ఎవరి పై ఏ రకంగా రాజకీయ వ్యాఖ్యానాలు చేసినా, అవి తిరిగి తమ కుటుంబానికే రివర్స్ లో తగులుతూ ఉండడం గమనార్హం.