మంత్రి ఈటల రాజేందర్ కబ్జాలు చేశారని ప్రజల నుంచి ఫిర్యాదులు రాగానే కేసీఆర్ స్పందించి విచారణ చేయించారని .. అలాగే ఇతర నేతల కబ్డాలపై విచారణ చేయించాలన్న డిమాండ్లు ఇతర పార్టీలు, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అన్ని స్థాయిల నేతలపైనా భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అనేక సార్లు ఆధారాలతో సహా బాధితులు రోడ్డెక్కారు. మంత్రి మల్లారెడ్డి వంటి వారిపై కబ్జా ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఉండటంతో కేసులు నమోదు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయి కానీ ఆ తర్వాత చర్యలు లేవు.
ఒక్క మల్లారెడ్డి కాదు.. మంత్రి తలసాని దగ్గర్నుంచి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వరకూ.. కనీసం అరవై నుంచి డెభ్బై మందిపైకబ్జాల ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా ప్రజలు ధర్నాలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జనగామ ఎమ్మెల్యే కబ్జాలపై ఓ ఉద్యమమే నడిచింది. కానీ అధికార పార్టీ నేతల కబ్జాలు ఎప్పుడూ చెల్లిపోతాయని… చెప్పుకుంటారు. ఎందుకంటే.. అలాంటి వారిపై చర్యలు తీసుకున్న సందర్భం ఒక్కటీ లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సొంత కేబినెట్లో మంత్రిగా ఉన్న ఈటలపై… కబ్జా ఫిర్యాదలు రాగానే.. కేసీఆర్ స్పందించి విచారణ చేయించారు. కేసీఆర్ ఆదేశించినందున.. ఒక్క పూటలోనే అధికారులు నివేదిక సమర్పించారు. కబ్జా నిజమేనని తేల్చారు.
దీంతో ఇతర టీఆర్ఎస్ నేతల బాధితుల్లోనూ ఆశలు రేకెత్తాయి. వారు.. మీడియా.. సోషల్ మీడియా ద్వారా తమ బాధలు వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు… టీఆర్ఎస్లోని పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వచ్చిన కబ్జా ఆరోపణలన్నింటినీ ఏకరవు పెట్టి.. చర్యలు తీసుకుంటారా లేదా అని డిమాండ్ చేస్తున్నాయి. ఇది టీఆర్ఎస్ నేతలకు కాస్తంత ఇబ్బందికరమే.