ఆంధ్రప్రదేశ్లో మరణ మృదంగం వినిపిస్తోంది. ఆస్పత్రుల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. కర్నూలు, అంత ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక ఇరవై మందికిపైగా చనిపోయినట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే తాము చెప్పినట్లుగా రాయకపోతే కేసులు పెడతామని ప్రభుత్వం ఇప్పటికే బెదిరించడంతో … ఆ కేసుల గురించి చెప్పడానికి భయపడుతున్నారు. అనంత ఆస్పత్రిలో రోగులకు ఆక్సిజన్ అందించే వ్యవస్థ కుప్పకూలింది. హుటాహుటిన నిపుణులను చెన్నై నుంచి పిలిపిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రోగులు ఒక్కొక్కరిగా చనిపోవడం ప్రారంభించారు. అంటే కారణం ఏమిటి..?. ఆక్సిజన్ ఉంది..కానీ దాన్ని సరఫరా చేసే వ్యవస్థ దెబ్బతినడంతో ప్రాణాలు పోయాయి.
కర్నూలులో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కారణంగా మరో ఆరుగురు చనిపోయారు. ఈ మరణాలన్నీ.. మీడియాలో రిపోర్ట్ అయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం .. అవన్నీ ఆక్సిజన్ మరణాలు కాదని ప్రకటించుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారి అనిల్ కుమార్ సింఘాల్.. మనసులో కూడా ఏ మాత్రం బాధ లేకుండా అవన్నీ ఆక్సిజన్ మరణాలు కాదనేశారు. నిజమే కావొచ్చు… ఇతర మరణాలు అయితే.. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదా..!?. అసాధారణంగా ప్రాణాలు పోతూంటే.. నిబ్బరంగా కూర్చుని అధికారులు ప్రకటనలు ఎలా చేయగలుగుతున్నారో కానీ.. ఎవరి నిర్లక్ష్యానికో… కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కనీసం వారి చావులు లెక్కలోకి కూడా రాని పరిస్థితి.
సెకండ్ వేవ్ వచ్చాక.. అనేక రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. వైరస్ వ్యాఫ్తిని నిపుణులు అంచనా వేసి చెబుతూంటే… ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం మొత్తం ఏపీనే దేశానికి ఆక్సిజన్ ఇస్తోందని.. ఏపీకి ఆక్సిజన్ కొరతేంటని అవహేళన చేసింది. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ నుంచి ఇతర చోట్లకు ఆక్సిజన్ తరలి వెళ్తోంది. ఏపీ కోసం కేంద్రాన్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఏపీకి ఆక్సిజన్ కొరత లేదు. కావాల్సినంత కేంద్రం ఇస్తోంది. కానీ తెచ్చుకునే రవణా సౌకర్యాలు లేకే… కిందామీదా పడుతున్నారు. వాటిని సమీకరించుకునేందుకు ఏపీ సర్కార్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందో లేదో ఎవరికీ తెలియదు.
అయితే ఏం జరిగినా ప్రజలకు తెలియకూడదు.. మీడియాలో ప్రచారం జరగకపోతే అదే చాలు.. అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజలకు జరిగిందేమిటో చెబితే.. కేసులంటూ.. బెదిరిస్తోంది. ఫలితంగా ప్రజలు.. తమ కష్టాన్ని కూడా.. మీడియాతో చెప్పుకునే పరిస్థితి లేదు. చెప్పినా.. వారి కష్టాల్ని మీడియా చూపించలేదు. ఎవరి చావు వారు చస్తున్నారు. కానీ బాధ్యతగా ప్రజల్ని కాపాడుకోవాల్సిన వాళ్లు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజలే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.