దేశమంతా ఎదురుచూస్తున్న బెంగాల్ ఎన్నికల తో పాటు, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాల ఎన్నికలు వాటితో పాటు నాగార్జునసాగర్ తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మొదలైంది. ప్రస్తుత ప్రారంభ ఫలితాలు దాదాపుగా అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ముందుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల పరిస్థితి చూస్తే, నాగార్జునసాగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భగత్ మొదటి రౌండు నుండి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి వెనుకంజలో ఉంటే, బిజెపి అభ్యర్థి ప్రస్తుతానికైతే ప్రభావం చూపినట్లు లేదు. ఇక తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో వై ఎస్ ఆర్ సి పి దూసుకెళ్తోంది. తిరుమల లో జరిగిన మొదటి రౌండ్ కౌంటింగ్ లో మొత్తం మూడు వేల ఓట్లు కౌంటింగ్ చేస్తే వాటిలో 2,500 ఓట్లు దాకా వైఎస్ఆర్సీపీకి రావడంతో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోయారు. వై ఎస్ ఆర్ సి పి భారీ మెజారిటీతో గెలవబోతోంది అన్న సంకేతాన్ని ఆ పార్టీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తిరుపతి ఓటర్లు ఎవరు వైఎస్ఆర్సిపి ఓటు వేయలేదని, పక్క ప్రాంతాల నుండి బస్సు లో దొంగ ఓటరు లను తరలించి ఓట్లు వేయించుకున్నారు అని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇక తమిళనాడులో డిఎంకె కూటమి దూసుకెళ్తోంది. జయలలిత మరణాంతరం అత్యంత వ్యతిరేకత కూడగట్టుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వం వెనుకంజలో ఉన్నప్పటికీ, ఊహించిన దాని కంటే మెరుగ్గానే ఆ పార్టీ కూడా ఫలితాలను పొందుతోంది. ఇక డిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్, అన్నా డిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి, వారి వారి నియోజకవర్గాల్లో ముందంజలోనే ఉన్నారు. వీరితో పాటు టీటీవీ దినకరన్, సినీ నటుడు కమల్ హాసన్ కూడా తమ తమ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. సినీ నటి కుష్బూ మాత్రం వెనుకంజలో ఉంది. అయితే డీఎంకే స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.
పుదుచ్చేరి లో కూడా ఎన్డీఏ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్నికలకు కేవలం కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా బిజెపి కూలదోయించిన సంగతి తెలిసిందే.
ఇక బెంగాల్ లో హోరాహోరి కొనసాగుతోంది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ , బిజెపి కంటే ఇరవై సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతి రౌండ్లోనూ ఇటు తృణమూల్ కాంగ్రెస్ ,అటు బిజెపి సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ ఆధిక్యం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. అంతేకాకుండా ఇటు మమతా బెనర్జీ , సువేందు అధికారి మధ్య పోటీ కూడా హోరాహోరీగా కొనసాగుతోంది.
ఇక అసోం లో కూడా ఫలితాలు ఎగ్జిట్ ఫలితాలు అంచనాకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. బిజెపి కుటుంబ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూటమి 19 స్థానాలు ఆధిక్యంలో కనిపిస్తోంది. బిజెపి అధికారాన్ని స్థాపించే దిశగా ముందుకు వెళుతుంది.
ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమి చరిత్రను తిరగరాస్తూ రెండోసారి అధికారాన్ని చేపట్టేలా కనిపిస్తోంది. బిజెపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మెట్రో శ్రీధరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఉమెన్ చాందీ కూడా ఆధిక్యం లోనే ఉన్నారు. పోటీ ప్రధానంగా ఎల్డీఎఫ్ యుటిఎఫ్ మధ్యనే కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి కేవలం నామమాత్రంగా మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
ఇవాళ సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.