తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వం వహించిన కూటమికి మ్యాజిక్ మార్క్ దక్కనుంది. అయితే.. అన్నాడీఎంకే ఎవరూ ఊహించనంత మెరుగ్గా ప్రదర్శన చేసింది. దాదాపుగా 90 అసెంబ్లీ సీట్లలో ఆధిక్యతలో ఉంది. డీఎంకే కూటమికి.. మెజార్టీ మార్క్ కన్నా.. కొద్దిగా మాత్రమే ఎక్కువగా రానుంది. నిజానికి ఎన్నికలకు ముందు నుంచీ జరిగిన ప్రచారానికి.. తమిళనాడులో వస్తున్న ఫలితాలకు చాలా తేడా ఉంది. స్టాలిన్ వేవ్ఉందని… అన్నాడీఎంకేను ఆయన తుడిచి పెట్టేస్తారని చెప్పుకున్నారు.
సర్వే సంస్థలన్నీ… డీఎంకే విజయాన్ని ఊహించాయి కానీ… అతి కష్టం మీద గెలుస్తుందని మాత్రం చెప్పలేదు. అన్నాడీఎంకే కూటమియాభై, అరవైసీట్లకే పరిమితమవుతుందని అంచనా వేశారు. కానీ ఫలితాలు మాత్రం రివర్స్‌లో ఉన్నాయి. డీఎంకేకు అన్నాడీఎంకే చాలా గట్టిపోటీ ఇచ్చింది. సమర్థమైన నాయకత్వం లేకపోయినా.. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ కీచులాడుకున్నా… ప్రజలు ఆ పార్టీ పై బాగానే ఆదరణ చూపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కటంటే.. ఒక్క లోక్‌సభ సీటు మాత్రమే వచ్చింది. అప్పట్నుంచి… డీఎంకే గెలుపు ఖాయమని అనుకున్నారు.
కానీ డీఎంకేకు అనుకున్నంత వేవ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు. డీఎంకే కూటమిగా మాత్రమే అధికారం చేపట్టగలుగుతుంది. అనూహ్యమైన ఫలితాలు సాధించిన అన్నాడీఎంకే ఇప్పుడు… డీఎంకే కన్నా ఎక్కువగా వార్తల్లో నిలవబోతోంది. అధికారం కోల్పోయినా… అన్నాడీఎంకే మాత్రం బలంగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది… డీఎంకేకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.