కేరళ, అసోంలలో సిట్టింగ్ పార్టీలు విజయాలు నమోదు చేశాయి. కేరళలో బీజేపీ వేసిన పాచికలు ఏమీ పారలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గోల్డ్ స్మగ్లింగ్ నిందితుడి ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నం.. విఫలమయింది. ఆయనకు మంచి మెజార్టీ వచ్చే దిశగా ఫలితాలు ఉన్నాయి. అయితే అక్కడ బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను పార్టీలో చేర్చుకునిఆయనకు.. టిక్కెట్ ఇచ్చి గొప్ప ప్రచారం చేసింది. బీజేపీ విధానాల ప్రకారం.. ఆయన వయసు పోటీకి అర్హత లేకపోయినా రంగంలోకి దింపింది. అయితే.. రెండు , మూడు స్థానాలకే పరిమితం అయింది. లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి రానుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మరోసారి ప్రతిపక్షంలోనే ఉండనుంది. వాస్తవానికి కేరళలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఓ సారి ఎల్డీఎఫ్..మరోసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయి. ఈ సారి చైన్‌ను పినరయి విజయన్ బ్రేక్ చేశారు. వరదలు వచ్చినప్పుడు.. కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవడంలో… ఆయన మంచి పనితీరు కనబర్చడంతో ఈ విజయం సాధ్యమైంది. అయ్యప్ప స్వామి దగ్గర్నుంచి ఎన్నో మత రాజకీయాలను బీజేపీ చేసినా ప్రయోజనం లేకపోయింది.
అసోంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలో నిలబెట్టుకుంది. మొదట సారి ఏ ఫార్ములాతో అయితే అధికారం దక్కించుకుందో… అదే ఫార్ములా రెండో సారి వర్కవుట్ అయింది. వలసదారులు… స్థానికుల మధ్య పెట్టిన చిచ్చు కారణంగా… స్థానికులైన వారతా.. బీజేపీ వైపే మొగ్గారు. దీంతో గత ఎన్నికల నాటి ఫలితాలు వస్తున్నాయి. అక్కడ సర్బానంద సోనోవాల్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ కాస్త మెరుగైన ఫలితం సాధించిన మరో రాష్ట్రం.. పుదుచ్చేరి. ఎన్నికలకు ముందే అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. రాష్ట్రపతి పాలన విధించేసిన … బీజేపీ… ఎన్ రంగస్వామి కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి..అధికారం సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. అక్కడ ఆ పార్టీ మెజార్టీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.