బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. చివరి రౌండ్లో ఆమె 1800 ఓట్ల తేడాతో గెలిచారని.. అన్ని మీడియా సంస్థలు హోరెత్తించాయి. అయితే కాసేపటికి 1622 ఓట్ల తేడాతో సువేందునే గెలిచారని తేలింది. దీంతో గగ్గోలు ప్రారంభమయింది. ఫలితాన్ని ప్రకటించవద్దని ఎన్నికల సంఘాన్ని తృణమూల్ కోరింది. ఫలితాలపై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన మమతా బెనర్జీ.. నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ప్రకటించారు. దీంతో ఆమె ఓటమిని అంగీకరించారని అనుకున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ వచ్చింది. ఈసీ.. కేంద్రానికి తొత్తులా వ్యవహరిస్తోందని తృణమూల్ ఆరోపించారు.
అక్కడ ఫలితాన్ని మళ్లీ సమీక్ష చేయాలని.. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్‌ను కాదని ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తే.. సుప్రీంకోర్టుకు వెళతామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. నందిగ్రామ్ పోరు మొదటి నుంచి ఉత్కంఠగా సాగింది. తొలి ఎనిమిది రౌండ్ల పాటు… మమతా బెనర్జీ పూర్తిగా వెనుకబడిపోయారు. దీంతో ఆమె ఓటమి ఖాయమనుకున్నారు. తర్వాత అనూహ్యంగా ముందుకు వచ్చారు. ఆధిక్యంలోకి వచ్చారు. మళ్లీ చివరి రౌండ్లకు వచ్చే సరికి.. ఆధిక్యం తగ్గిపోయింది. చివరి ఒక్క రౌండ్ మిగిలి ఉన్న సమయంలో ఆరు ఓట్ల తో వెనుకబడి ఉన్నారు.
చివరి రౌండ్ పూర్తయిన తర్వాత 1800 ఓట్ల ఆధిక్యతతో గెలిచారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ లెక్కలేమిటో కానీ.. కాసేపటికే.. 1622 ఓట్లతో సువేందునే గెలిచారని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ధృవీకరణ పత్రం ఇవ్వొద్దని తృణమూల్ డిమాండ్ చేసింది. మమతా ఓటమి దాదాపు ఖాయం కావడంతో.. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా లేదా అన్నదానిపై చర్చలు సాగాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని మేనల్లుడు అభిషేక్ బెనర్జికి అప్పగించి.. తాను దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమం చేపడతారని అనుకున్నారు. కానీ.. తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని.. మమతా బెనర్జీ ప్రకటించారు.