తిరుపతి లోకసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయదుందుభి మోగించింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక వైఎస్ఆర్సిపి టీడీపీల కంటే భారతీయ జనతా పార్టీకి అసలైన పరీక్ష గా మారనుంది అన్న విశ్లేషణల మధ్య బరిలోకి దిగిన బిజెపి అన్ని పరీక్షలలోనూ విఫలమైంది అన్న అభిప్రాయం ప్రస్తుతం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
Read Also : తిరుపతి ఉప ఎన్నిక, బీజేపీ కి అనేక పరీక్షలు
తిరుపతి ఫలితాలు, ఓట్ల శాతం:
సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ సీపీకి చెందిన దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ నుండి అధికార వైఎస్ఆర్ పార్టీ తరఫున గురుమూర్తి బరిలో దిగారు. ఈయన దాదాపు 6,26,000 ఓట్లను సాధించారు. ఇవి దాదాపు 56 శాతం ఓట్లు. సమీప ప్రత్యర్థి టిడిపి నేత పనబాక లక్ష్మి 32 శాతం ఓట్లను అంటే దాదాపు మూడున్నర లక్షల ఓట్లను సాధించారు. బిజెపి తరఫున పోటీలోకి దిగిన మాజీ ఐఏఎస్ రత్నప్రభ కేవలం 57 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇవి దాదాపు 5 శాతం ఓట్లు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2019 తో పోలిస్తే 1.6 % ఓట్లను అధికంగా సాధిస్తే, టిడిపి అభ్యర్థి 2019 పోలిస్తే, 5% తక్కువ ఓట్లను సాధించారు. ఇక బిజెపి అభ్యర్థి గతం కంటే 4 శాతం అధికంగా ఓట్లను సాధించారు. అయితే మరొక రకంగా చూస్తే 2019లో బీజేపీ అభ్యర్థి, జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పి అభ్యర్థి కి కలిపి 2.8 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బిజెపి జనసేన కలిపి పోటీ చేశాయి కాబట్టి వారి కూటమి ఉమ్మడి అభ్యర్థిి, గతంతో పోలిస్తే కేవలం 2.5% ఫలితంగా ఓట్లు అధికం గా సాధించినట్లు.
బలమైన ప్రత్యామ్నాయం తామే అని నిరూపించు కోవడం లో ఘోర వైఫల్యం
కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే బిజెపి అభ్యర్థి సాధించడంతో ఇప్పటివరకు బీజేపీ నేతలు చెబుతూ వస్తున్న, “వైఎస్ఆర్సీపీకి తామే అసలైన ప్రత్యామ్నాయం” వ్యాఖ్యానాలన్నీ గాలి బుడగలే నని తేలిపోయింది. ప్రత్యామ్నాయం సంగతి పక్కన పెడితే , కనీసం రెండవ స్థానంలో ఉన్న టీడీపీకి దరిదాపుల్లో కూడా బిజెపి లేకపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. టిడిపి అభ్యర్థి 32 శాతం ఓట్లు సాధిస్తే బిజెపి అభ్యర్థి ఐదు శాతం ఓట్లతో నిలిచిన సంగతి తెలిసిందే.
సోము వీర్రాజు , సునీల్ దియోధర్ ల సామర్థ్యం పై నీలినీడలు:
సోము వీర్రాజు పై గత కొంత కాలంగా ఒక రకమైన ఒత్తిడి ఉంది. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు వెళ్తూ కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారని, దుబ్బాక జిహెచ్ఎంసి లో బండి సంజయ్ పార్టీని విజయ పథంలో నడిపించారని, బండి సంజయ్ స్థాయిలో సోము వీర్రాజు విజయం సాధిస్తాడా లేదా అని వీర్రాజు పై ఒత్తిడి పలు వైపుల నుండి ఒత్తిడి వచ్చిన సంగతి వాస్తవమే. అయితే సోము వీర్రాజు తన పై పార్టీ అధినాయకత్వం పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారనే చెప్పాలి. అయితే మరొక వైపు నాగార్జునసాగర్ లో బిజెపి అభ్యర్థి డిపాజిట్లు కోల్పోవడంతో బండి సంజయ్ ఇమేజ్ కూడా మసకబారటం గమనార్హం.
ఇక సోషల్ ఇంజనీరింగ్, ఎలక్షనీరింగ్ లో అత్యంత ప్రతిభావంతుడు అని పిలువబడే సునీల్ దియోధర్ కూడా ఈసారి తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీని గణనీయమైన ఓట్లు సాధింపజేయడంలో విఫలమైనట్లే చెప్పుకోవాలి. తిరుపతికి ఉప ఎన్నికల్లో బిజెపిని గెలిపించడం అసాధ్యమే అయినప్పటికీ, కనీసం రెండో స్థానానికి దరిదాపుల్లోకి బీజేపీని సునీల్ దియోధర్ తీసుకురాగలడని నమ్మిన వారి ఆశలను ఆయన వమ్ము చేశాడనే చెప్పాలి. గెలవక పోయినా పర్లేదు కానీ, కనీసం లక్ష ఓట్లు సాధించాలన్న అంతర్గత లక్ష్యంతో పోటీలోకి దిగిన బిజెపి ఆ లక్ష్యాన్ని కూడా సాధించలేక పోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి రాజకీయ భవితవ్యానికి భారీగా గండి కొట్టింది అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వైసీపీ తో కుమ్మక్కు ఆరోపణలను తిప్పి కొట్టగలిగిందా?
గత కొంత కాలంగా వై ఎస్ ఆర్ సి పి పార్టీతో రాష్ట్ర బిజెపి నాయకులకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయని, తమ పార్టీ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ కొందరు నేతలు వైఎస్సార్సీపీ తో కుమ్మక్కు అయ్యారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పి కొట్టే అవకాశం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కల్పించినప్పటికీ, ఆ అవకాశాన్ని బిజెపి సరిగా ఉపయోగించుకోలేదు. జేపీ నడ్డా తప్ప ఇతర ప్రముఖ జాతీయ నాయకులు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడంతో బిజెపి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అమిత్ షా స్థాయి నేతలు జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రచారం చేసినట్లుగా తిరుపతిలో కూడా ప్రచారం చేసి ఉంటే కనీసం కొంత ప్రభావం ఉండేదని, అలా జరగకపోవడం పార్టీ అవకాశాలను కొంతవరకు దెబ్బతీసిందని బిజెపి క్యాడర్ అభిప్రాయ పడుతోంది.
బిజెపి జనసేన బంధం కొనసాగుతుందా?
బిజెపి జనసేన పార్టీలు – దీర్ఘకాలిక ప్రాతిపదికన తాము పొత్తు పెట్టుకున్నామని, ఒక ఉప ఎన్నికల ఫలితాలు తమ పొత్తు ని నిర్వీర్యం చేయలేవని టీవీ డిబేట్ల లో చెబుతున్నారు. ఒక్క ఉప ఎన్నిక ఫలితం ఇప్పటికిప్పుడు పొత్తును విచ్ఛిన్నం చేయక పోయినప్పటికీ, బిజెపి జనసేన ల మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ చర్చలలో తిరుపతి ఉప ఎన్నిక ఫలితం పంటి కింద రాయిలా తగిలే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
మొత్తం మీద:
2019 లోకసభ ఎన్నికలలో కేవలం 16 వేల ఓట్లు సాధించి, నోటా, కాంగ్రెస్, బీ.ఎస్.పి (జనసేన కూటమి) కంటే కింద ఉన్న బిజెపి, ఇప్పుడు 57 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇందులో పెద్దగా సంబర పడాల్సింది ఏమీ లేదు. సామాజిక సమీకరణాలు అనుకూలిస్తాయి అని భావించిన తిరుపతిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు మిగతా చోట్ల ఏ విధంగా ఉంటుంది అన్నది అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానంలో, తోక పార్టీగా మిగిలి పోకుండా ఉండడానికి బిజెపి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తుంది, అసలు చేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.
– Zuran