ఈటల రాజేందర్‌పై కేసీఆర్ ప్రయోగిస్తున్న అస్త్రాలు ఆయనను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. అయితే.. ఈటల మాత్రం ఎక్కడా ఆవేశపడటం లేదు. ఆయన టీఆర్ఎస్లో తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడో అంచనా వేశారని.. దానికి తగ్గట్లుగా ప్రిపేర్ అయ్యారని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. అవమానకరంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఇక పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడమే మిగిలింది. తనపై కుట్ర జరుగుతోందని తెలిసినప్పటి నుండి ఈటల భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. అందుకే ఆయనపై ఆరోపణలు రాగానే… ముదిరాజ్ కుల సంఘంలో అలజడి రేగింది. పెద్ద ఎత్తున నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ కుల మంత్రిపై కుట్ర చేస్తున్నారని ధర్నాలు చేశారు.
ఈటల మొదటి నుంచి బీసీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మంచి వ్యక్తిగా… సాయం చేసే మంత్రిగా… ఆయనకు పేరు ఉంది. ఇతర నేతల్లా ఆయన వేల కోట్లు సంపాదించలేదని.. నిజాయితీగానే ఉన్నారన్న పేరు కూడా ఉంది. అందుకే ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలుగానే ఎక్కువ మంది నమ్ముతున్నారు. స్వయంగా టీఆర్ఎస్లోనే సానుభూతి ఉండటంతో ఈటల కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈటల సొంత పార్టీ పెట్టబోతున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే కేసీఆర్.. ఎక్స్ట్రీమ్ స్టెప్ వేశారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవమానకరంగా తనను పంపేసిన తర్వాత అలాంటి ఆలోచన లేకపోయినా… ఆయన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంది.
కేసీఆర్ చర్యలతో ఈటల రాజేందర్‌కు ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఆయన ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదు. అలా చేరితే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఇప్పుడు.. టీఆర్ఎస్లో తనలాగే అణిచివేతను ఎదుర్కొంటున్న నేతలను కలుపుకుని ఆయన టీఆర్ఎస్పైనే పోరాటం చేయాల్సి ఉంది. అధికారం అందినతర్వాత కేసీఆర్ వ్యవహారశైలి మారింది . ఆయన ఎవర్నీ లెక్క చేయడం లేదు. ఎవర్నీ కలవడం లేదు కూడా. అదే సమయంలో అన్ని పార్టీల నేతను చేర్చుకుని… అందరికీ న్యాయం చేయలేకపోయారు. ఇలాంటి వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. వారందరూ ఈటలతో టచ్‌లోకి వచ్చినట్లుగా చెబుతున్నారు.
అదే్ సమయంలో టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమ సమయంలో… తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన నేతలు ఇప్పుడు.. పదవులు అనుభవిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన నేతలు.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అభిప్రాయం ఉద్యమకారుల్లో చాలా రోజుల నుంచి బలంగా ఉంది. ఈటల తొలగింపుతో అది.. బయటపడే అవకాశం ఉంది. నిజమైన ఉద్యకారులకే తెలంగాణలో అవకాశాలు దక్కాలనే రీతిలో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈటల వెంట.. ఎవరు ఉంటారన్న దానిపై.. ఆయన అడుగులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.