నాలుగు చేతులా సంపాదించడం ఎలాగో ఈతరం కథానాయికలకు బాగా తెలుసు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఆదాయాన్ని రాబట్టే అనేక మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు షాపింగ్ మాల్స్ లో సందడి చేయడం లాంటివి. మెట్రో సిటీస్‌లో షాపింగ్ మాల్స్ కి, అందులో జరిగే ఆడంబరమైన వేడుకలకు కొదవ ఉండదు. ఆర్.ఎస్.బ్రదర్స్, సౌత్ ఇండియా… ఇలాంటి మాల్స్… హైదరాబాద్ లో ఏరియాకి ఒకటి వెలుస్తుంటుంది. అందులో… హీరోయిన్లు రిబ్బన్ కటింగులు చేయడానికి, బోలెడంత ఛార్జ్ చేస్తారు. ఓ అగ్ర హీరోయిన్ షాపింగ్ మాల్ లో అడుగుపెట్టడానికి కనీసం 5 నుంచి 7 లక్షల వరకూ వసూలు చేస్తుంటుంది. ఇదంతా గంటలో జరిగే వ్యవహారం. ఈ తరహా బేరాలు కనీసం నెలకు నాలుగైనా తగిలేవి. సినిమాల్లేక ఖాళీగా ఉన్నవాళ్లకు సైతం… నెలవారీ ఖర్చులకు కావల్సినంత మొత్తం వచ్చేసేది. కనీసం లక్ష రూపాయలు చేతిలో పడితే గానీ, కాంప్లెక్స్‌లో అడుగుపెట్టరెవరూ..! ఒకటీ, అరా సినిమా చేస్తే చాలు. ఆ సినిమా హిట్టవ్వకపోయినా ఫర్వాలేదు. ఆ తరహా కథానాయికలంతా షాపింగ్ మాల్స్ పుణ్యమా అని బాగానే సొమ్ము చేసుకోగలిగారు.
అయితే ఇది కరోనా కాలం. మార్కెట్లో సరైన బేరాలే లేవు. కొత్త షాపింగ్ మాల్స్ తెరుస్తున్నా – సెలబ్రెటీల్ని పిలుచుకుని రిబ్బన్ కట్ చేయించుకునేంత ఓపిక ఎవరికీ ఉండడం లేదు. పైగా… సోషల్ డిస్టెన్స్ పాటించడం ఇప్పుడు అందరి ముందున్న నైతిక బాధ్యత. సెలబ్రెటీలు వస్తున్నారంటే… గుంపులు గుంపులుగా జనం వచ్చిపడిపోతారు. వాళ్లని కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. అందుకే… ఈ తరహా కార్యక్రమాలకు స్వస్తి పలికారంతా. పైగా.. సెలబ్రెటీలు వచ్చినంత మాత్రన బిజినెస్ పెరగదన్న విషయం… ఇప్పుడిప్పుడే వాళ్లకూ అర్థమవుతోంది. వాళ్ల కోసం హంగు, ఆర్భాటాల కోసం లక్షలు ఖర్చు పెట్టడం వృధా ప్రయాస అని తెలిసిపోయింది. అందుకే….ఈ బాపతు హంగామాకు చెక్ పెట్టారంతా.