హైదరాబాద్: డీఎమ్‌కే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అధికారపార్టీ అన్నాడీఎమ్‌కేకు చేరువవుతున్నారు. డీఎమ్కేను తీవ్రంగా విమర్శిస్తూ అన్నాడీఎమ్కేపై ప్రశంశలు గుప్పిస్తున్నారు. కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్ మధ్య ఎంతో కాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇద్దరిలోనూ స్టాలిన్ వ్యవహారం ఒక పద్ధతిగా ఉంటుంది. అళగిరిది రెబల్ టైపు. సహజంగానే కరుణానిధి స్టాలిన్ వైపే మొగ్గు చూపుతుంటారు. దీనిని తట్టుకోలేని అళగిరి తండ్రిపై అప్పుడప్పుడూ తిరగబడతుంటారు… మళ్ళీ కలిసిపోతుంటారు. కొద్ది రోజులక్రితం స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేయటంతో అళగిరిని కరుణ పార్టీనుంచి బహిష్కరించారు. దీంతో అతను డీఎమ్‌కేపై విమర్శల దాడి ప్రారంభించారు. కాంగ్రెస్, డీఎమ్‌కే పార్టీలు ఇటీవల పొత్తు కుదుర్చుకోవటంపై స్పందిస్తూ, ఎన్ని కూటములు ఏర్పడినా అన్నాడీఎమ్కేను ఏమీ చేయలేవని అన్నారు. కాంగ్రెస్, డీఎమ్‌కే రెండూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని విమర్శించారు. అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి స్పందిస్తూ, అతని మాటలను పట్టించుకోవద్దని, అతనికీ డీఎమ్‌కేకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అళగిరి ప్రభావం డీఎమ్‌కేపై ఎంతవరకు ఉంటుందో చూడాలి.