షామీర్ పేట్ దగ్గర దేవరయాంజల్ శ్రీ సీతారామ ఆలయానికి సంబంధించిన భూముల కబ్జాలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆటలను టార్గెట్ చేసి.. ఆయనకు సంబందించిన వారు.. ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూముల్ని కబ‌్జా చేసి.. గోడౌన్లు నిర్మించారని ప్రధానమైన ఆరోపణ. నిజానికి ఈటల..ఆయన మనుషులకు గోడౌన్లు ఉన్నాయేమో కానీ.. ఆయన ఒక్కరివి మాత్రమే లేవు. అక్కడ శ్రీ సీతారామ ఆలయానికి సంబంధించిన భూములన్నీ రాజకీయనేతల కబ్జాలోనే ఉన్నాయి. పెద్ద పెద్ద గోడౌన్లు.. ఇతర నిర్మాణాలు చేశారు. అందుకే.. ఆ భూముల చిట్టామొత్తం బయటకు తీస్తే.. పెద్ద పెద్ద నేతల బాగోతాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
మేడ్చల్ జిల్లా దేవరయంజాల్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి మాన్యం భూమి పదిహేను వందల ఎకరాలు ఉంటుంది. ఈ ఆలయానికి ఆరొందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు మరుమూల గ్రామం అయినా… ఔటర్ నిర్మాణం తర్వాత హైదరాబాద్‌లో కలిసిపోయింది. ఫలితంగా అక్కడ ఎకరం ముఫ్పై, నలభై కోట్లకు చేరుకుంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన నేతలు.. అక్కడ వాలిపోయారు. ముఫ్పై ఏళ్లుగా కబ్జాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల్లో ఉన్న వారే కబ్జాలకు పాల్పడటంతో ఆ భూములను కాపాడాల్సిన దేవాదాయ అధికారులు చూస్తూండిపోయారు. భూముల కబ్జాలపై లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో భూములవివరాలను అధికారులు లోకాయుక్తకు సమర్పించారు. మొత్తంగా 1521 ఎకరాల భూమి ఉందని లెక్కలు చెప్పారు.
వెంటనే ఈ భూమి మొత్తాన్ని ఎండోమెంట్ శాఖకు చెందినది ఆర్డర్ ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. 2005లో అప్పటి రంగారెడ్డి జిల్లా డీఆర్వోను కోరుతూ దేవాదాయ శాఖ లేఖ పంపినా ఇంత వరూక దానికి మోక్షం కలగలేదు. ఇదే అదనుగా కబ్జాదారులు చెలరేగిపోయారు. అటు ఎండోమెంట్ అధికారులు.. ఇటు ప్రభుత్వంలోని అధికారంలో ఉన్న వారితో కలిసి కబ్జాలు ప్రారంభించారు. దీంతో 324 ఎకరాలకుపైగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్‌ని జారీ చేసేశారు. వారు నిర్మాణాలు చేసేసుకున్నారు. ఈ భూముల్లో ఈటల.. ఆయన అనుచరులవే కాదు.. ఓ ఎంపీతో పాటు, ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి… ఓ పత్రికకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి. విశేషం ఏమిటంటే… కొంత మంది ఈ భూముల్ని బ్యాంకుల్లో పెట్టి వందల కోట్లు రుణాలు తీసుకున్నారు.
ఎంపీ రేవంత్ రెడ్డి… ఈ భూములకు సంబంధించిన కొన్ని వివరాలు బయట పెట్టారు. ఐఏఎస్ కమిటీ విచారణలో ఈ వ్యవహాలన్నీ వెలుగులోకి వస్తేనే.. ఆ భూముల్ని కాపాడాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించినట్లు అవుతుంది. లేకపోతే..రాజకీయ కక్షల కోసమే … ఈటలను టార్గెట్ చేసే విచారణ చేస్తున్నారని భావిస్తారు. అయితే ఈ భూముల అంశం.. ప్రభుత్వాలు మారిన తర్వాత .. పెద్ద రాజకీయ అస్త్రంగా మారడానికిమాత్రం బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.