ఐపీఎల్ జట్లలో కరోనా కలలకం రేపుతోంది. బయోబబుల్ ద్వారా కరోనా నుంచి రక్షణ పొందొచ్చని ధీమాగా ఉన్న ఐపీఎల్ ఆటగాళ్లని.. కొలకొత్తా ఆటగాళ్లు కరోనా బారీన పడడం షాక్ కి గురి చేసింది. చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కి కరోనా సోకడం, మరో ఒకరిద్దరు సిబ్బంది కూడా ఇదే జాబితాలో చేరడంతో కరోనా భయాలు పుట్టుకొచ్చాయి. కరోనా కారణంగా సోమవారం నాటి మ్యాచ్ వాయిదా పడింది. ఈరోజు ముంబై – హైదరాబాద్ జట్ల మధ్య మరో పోరు ఉంది. అది యధావిధిగా జరుగుతుంది. కాకపోతే… తదుపరి మ్యాచ్‌ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఐపీఎల్ రద్దు చేస్తారా, వాయిదా వేస్తారా? లేదంటే వేదిక మారుస్తారా? అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
కరోనా విషయంలో ఆటగాళ్లంతా ఆందోళన చెందుతున్నారన్నది వాస్తవం. `మీరు ఐపీఎల్ లో కొనసాగాలా, వద్దా అనేది మీ నిర్ణయమే. బోర్డు జోక్యం చేసుకోదు` అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మిగిలిన బోర్డుల మాట కూడా దాదాపుగా ఇదే. ఎవరి రిస్క్ వాళ్లు తీసుకుని ఆడాల్సిందే. అయితే చాలామంది ఆటగాళ్లకు ఇంటి బెంగ పట్టుకుంది. విదేశీ ఆటగాళ్లు.. ఎప్పుడు విమానం ఎక్కేద్దామా అని చూస్తున్నారు. కాకపోతే.. ఇండియా నుంచి విదేశాలకు విమాన సర్వీసులు రద్దు అవ్వడంతో – ఆ ఆటగాళ్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఇంటికి వెళ్లలేరు. అలాగని ఐపీఎల్ ఆడలేరు.
మరోవైపు ఐపీఎల్ ని వాయిదా వేసే ప్రసక్తే లేదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సగం లీగ్ అయిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ ని వాయిదా వేస్తే.. ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయని చెబుతోంది. పైగా ఈ యేడాది టీ 20 ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్ లోని పరిస్థితులు బాగున్నాయని చెప్పడానికే… 2021 ఐపీఎల్ ని ఇండియాలో నిర్వహించతలపెట్టింది బీసీసీఐ. నిజానికి ఈ ఐపీఎల్ కూడా దుబాయ్‌లో నిర్వహిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. 2020 లో ఐపీఎల్ అక్కడ సక్సెస్ఫుల్ అవ్వగొట్టింది బీసీసీఐ. ఈసారీ అక్కడే అయితే ఎలాంటి గొడవా ఉండేది కాదు. 2021 ప్రపంచ కప్ వేదిక ఇండియా నుంచి ఎక్కడ చేతులు మారిపోతుందో అన్న భయంతో..ఐపీఎల్ ని దుబాయ్ లో నిర్వహించడానికి బీసీసీఐ ససేమీరా అంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ప్రపంచ కప్ నిర్వహణ భారత్ లో కష్టమే అని తేలిపోయింది. విదేశీయులు భారత్ రావడానికి భయపడే అవకాశాలే ఎక్కువ. అందుకే.. ప్రపంచ కప్ వేదిక దుబాయ్ కి మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐపీఎల్ వాయిదా వేసి, వేదిక మార్చాలనుకుంటే.. దుబాయ్ మంచి ప్రత్యామ్నాయం. ఐపీఎల్ ఆటగాళ్లు.. ఈ టోర్నీలో కొనసాగడానికి ససేమీరా అంటే మాత్రం ఈ టోర్నీని దుబాయ్ కి తరలించడం తప్ప మరో మార్గం లేదిప్పుడు.