కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇంటా బయటా ప్రభుత్వ నిర్ణయాల్లో అసమర్థతకు నిలువెత్తు సాక్ష్యాల్లా నిర్ణయాలు ఉంటూండటంతో ఏం చేయాలో తెలియక కొట్టు మిట్టాడుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి బయట ప్రపంచానికి భయంకరంగా కనిపిస్తోంది. కానీ ఇండియా ప్రభుత్వానికి మాత్రం చాలా తేలికగా కనిపిస్తోంది. అందరూ ఇండియాను దూరం పెట్టి… కట్టడి ఎలా చేయాలో సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న చర్యలతో కరోనా కట్టడి ఆగిపోయే స్టేజ్ అయిపోయిందని… కఠినమైన లాక్ డౌన్ మాత్రమే మార్గని.. అమెరికా నుంచి ఇండియాలోని వైద్య నిపుణుల వరకూ సూచనలు చేస్తున్నారు. అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనియో ఫౌచీ… ఎయిమ్స్ చీఫ్ గులేరియా కేంద్ర ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తి చేశారు.
దేశంలో అధికారికంగా నమోదవుతున్న కరోనా కేసులు రోజుకు నాలుగు లక్షలు ఉండవచ్చు కానీ.. టెస్టులు చేయకుండా… భయంకరంగా పాకిపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మరణాలను కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు దాచి పెడుతున్నాయని.. స్మశానాల దగ్గర… ఖాళీ లేకపోవడం అంటే.. ఎంత అసాధారణ స్థాయిలో మరణాలు ఉన్నాయో సులువుగా అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే… దేశ మానవ వనరులపై తీవ్రమైన దెబ్బ పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ నిన్నామొన్నటిదాకా ఎన్నికలు.. కౌంటింగ్.. కోసం ఆలోచించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏం చేయాలో క్లూలెస్‌గా మారిపోయింది.
నిర్ణయాలు తీసుకోవడంలో అనాలోచితిం కారణంగా దేశం తీవ్రంగా నష్టపోతోందని.. నాయకత్వ లోపం.. దేశానికి ప్రమాదకరంగా మారిందని.. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. నిర్మోహమాటంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశం గడ్డు పరిస్థితుల్లోకి పోవడానికి నాయకత్వ లోపమే కారణం అన్నారు. ఎలా చూసినా కేంద్రం ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ప్రపంచంలోని దేశాలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనా నుంచి బయటపడినా ఇండియాలో మాత్రం సెకండ్ వేవ్ .. ప్రాణాలను తీస్తోంది. దీనికి కారణం… కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. ప్రజల పట్ల ఏ మాత్రం పట్టింపు లేని తనమేనని అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
లాక్ డౌన్ విధించేది లేదని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని తేల్చేసింది. అయితే అంతర్జాతీయంగా వస్తున్న సలహాలు… దేశీయంగా పెరిగిపోతున్న మరణాలు.. కేసుల కారణంగా కేంద్రం నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. బుధవారం జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి..!. ఏ మాత్రం తేడా వచ్చినా… రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.