శ్రీవారి నామస్మరణతో నిత్యం ఆయన కంకైర్యాలను నిష్టతో చేయాల్సిన అర్చకులు అన్యాయం జరిగిందంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం.. అస్మదీయులకు పెద్ద పీట వేసేందుకు ఇతరులకు అన్యాయం చేయడం లాంటివి చేస్తూండటంతో.. ప్రధాన అర్చకులు కూడా.. న్యాయస్థానాల వెంట పరుగులు తీయాల్సి వస్తోంది. గతంలో తనను పదవి నుంచి తొలగించారంటూ రమణదీక్షితులు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. తాజాగా వేణుగోపాల దీక్షితులు అనే ప్రధాన అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. రమణదీక్షితులు రిటైర్మెంట్ తర్వాత వేణుగోపాల దీక్షితులనే ప్రధాన అర్చకునిగా ఉన్నారు.
అయితే ప్రభుత్వం తిరుపతి ఎన్నికలకు ముందుకు… రమణదీక్షితులకు మళ్లీ ప్రధాన అర్చకునిగా పదవి ఇచ్చింది. దీంతో వేముగోపాల దీక్షితులకు అన్యాయం జరిగినట్లయింది. దీంతో ఆయన తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా.. తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని ప్రధానంగా సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను వేణుగోపాలదీక్షితులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ.. ప్రభుత్వం, టీటీడీపై కోర్టును వేణుగోపాల దీక్షితులు ఆశ్రయించడంతో సంచలనంగా మారింది.
గతంలో రమణదీక్షితులు.. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాతనే కోర్టులో పిటిషన్ వేశారు. వేణుగోపాల దీక్షితులను తప్పించడానికి కూడా అవకాశం లేదు. ఆయన వంశపారంపర్య అర్చకుడు. అర్చకులు ఇలా న్యాయం కోసం.. అసలు పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం… శ్రీవారి భక్తుల్ని విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ పార్టీలు … దేవుడితో రాజకీయాలు చేయడం మానుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.