ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడ్డారని.. అసైన్డ్ భూములను గుంజుకున్నారని ఇచ్చిన నివేదిక ఆధారంగా.. మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నుంచి మొదటగా శాఖలు.. ఆ తర్వాత మంత్రి పదవిని ఒక రోజు తేడాతో సీఎం కేసీఆర్ తొలగించేశారు. అయితే ఇప్పుడు ఆ నివేదిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ రిపోర్టు చెల్లకపోయినా ఈటల రాజేందర్‌పై తీసుకున్న చర్యలు మాత్రం చెల్లుతాయి. అయితే ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఊరట లభించినట్లయింది. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించారని.. ఎలాంటి నోటీసులివ్వకుండా విచారణ చేపడుతున్నారని జమునా హ్యాచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు… ప్రభుత్వాన్ని కీలకమైన ప్రశ్నలు అడిగింది.
ముందస్తుగా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించింది. దీనపై ప్రభుత్వ లాయర్ నీళ్లు నమిలారు. హైకోర్టు అనేక నిబంధనలను ప్రస్తావించి.. అలా చేశారా అంటే… సమాధానం లేకపోయింది. దీంతో హైకోర్టు… మే 1, 2న జరిగిన విచారణ.. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని స్పష్టం చేసింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని.. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు విచారణలో ఈటల ఫ్యామిలీకి కాస్త నైతిక మద్దతు లభించినట్లయింది. ఇప్పటికే ఆ భూముల్లో అక్రమాలు లేవని.. అక్రమాలు ఉన్నాయని కోర్టులో తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ఈటల చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు సీఎం కేసీఆర్ అలా ఆదేశించగానే.. ఇలా… నివేదికలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి సమర్పించారు. వాటి ఆధారంగా ఈటలపై తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కేసీఆర్ తీసుకున్నారు. ఆ నివేదికలు చెల్లవని.. హైకోర్టు చెప్పినా… ఈటలకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.
మరో వైపు ఈటలపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. మేకవన్నే పులి అని కరీంనగర్ నేతలంతా ప్రెస్ మీట్ పెట్టి మండిపడ్డారు. అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికే ఆ ప్రెస్ మీట్ అని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈటలను పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని చెబుతున్నారు.