రేషన్ సరుకులు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలన్న ఏపీ సర్కార్ ప్రయత్నం.. ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ వాహనాలు పొందిన డ్రైవర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగారు. గట్టిగా పథకాన్ని ప్రారంభించి మూడు, నాలుగు నెలలు కాక ముందే వారు రెండో సారి ఆందోళనకు దిగారు. మొదట్లో ప్రభుత్వం తమకు ఇచ్చే మొత్తం గిట్టుబాటు కావడం లేదని వాహనాలు ఆపేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మరో ఐదు వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంపు నిర్ణయం తీసుకుని మూడు నెలలు కాక ముందే మరోసారి సమ్మెకు దిగారు. సమయం చూసి.. సమ్మెకు దిగడంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది.కరోనా కారణంగా ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చేది.. రాష్ట్రం ఇచ్చేది కలిపి పంపిణీ చేయాలని ఆదేశించింది.
అయితే తాము పంపిణీ చేయబోమని.. వారు తేల్చేశారు. కేంద్రం ఇచ్చేది పంపిణీ చేయాలంటే అదనపు మొత్తం ఇవ్వాలని.. వెంటనే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని.. ఇలా రకరకాల డిమాండ్లు పెట్టి సమ్మెలోకి వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వం సైలెంటయింది. ఈ సమస్యకు అధిక ప్రాధాన్యం ఇస్తే ఎక్క రచ్చ అవుతుందోనని సైలైంట్ అయిపోయింది. కానీ.. ఈ నెల రేషన్ పంపిమీ ఏపీలో ఇంకా ప్రారంభం కాలేదు. కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్న సమయంలో రేషన్ పంపిణీ జరగకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. డీలర్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం వైపు నుంచి అనధికారిక ఒత్తిడి వస్తోంది. అయితే డీలర్లు పంపిణీ చేసే సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం డిలీట్ చేసింది.
దీంతో డీలర్లు పంపిణీ చేయడానికి సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే వీఆర్‌వోలు.. లేకపోతే.. వాహనాల యజమానులే రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఈ సమస్యను ఎంత వేగంగా పరిష్కరిస్తే అంత వేగంగా ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. లేకపోతే.. ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు కష్టాలు లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వం…కష్టాలు పెంచేయడంతో… వ్యూహలోపం స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ పంపిణీ చేయాల్సిన వాహన యజమానులు.. సమ్మెకు దిగినా పట్టించుకోకపోవడం… డీలర్ల ద్వారానే మళ్లీ పంపిణీ చేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తూండటంతో… ఇంటింటికి రేషన్ పథకాన్ని అలా వదిలేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది.