తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోతున్నా… ఆ పార్టీ హైకమాండ్ మాత్రం నిద్ర లేవడం లేదు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఎన్నిక వచ్చినా… తరవాత ప్రకటిస్తామంటూ.. చెప్పుకుంటూ టైంపాస్ చేస్తోంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా ముగిసింది. అక్కడా ఎదురు దెబ్బ తప్పలేదు. ఇప్పుడైనా పీసీసీ చీఫ్‌ను ఎంపిక విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తుందా లేగా ఎప్పటికే నాన్చుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తన నాయకత్వంలో పార్టీ నిర్వీర్యం కావడంతో ఉత్తమ్ కుమార్ రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఆయన హైకమాండ్‌కు లే్ఖ పంపారు.
ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రేస్ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఢిల్లీ పెద్దలకు ఓ రిపోర్ట్ అందజేశారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారనే లీకులు వచ్చాయి. దాని పై కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతోఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ను ఫైనల్ చేశారు. కానీ ఆయన తన వల్ల కాదని చేతులెత్తేశారు. అప్పుడు… సాగర్ ఉపఎన్నికను సాకుగా చూపి ప్రకటనను నిలిపివేసింది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించడం ఖాయమని ఎన్నో సార్లు ప్రచారం జరిగింది.
ఇలా నిర్ణయం తీసుకున్నారని బయటకు వచ్చినప్పుడల్లా.. ఆయనపై ఓ కేసు పెట్టి.. జైలుకు పంపడమో… లేకపోతే మరో వివాదం సృష్టించడమో చేస్తున్నారు. అధికార పార్టీ కూడా..రేవంత్ ను పీసీసీ చీఫ్ కాకుండా ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ లోని సీనియర్లు అదే లక్ష్యంతో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ…కాంగ్రెస్ హైకమాండ్‌కు పజిల్లా మారాయి. ఇప్పుడైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోకపోతే.. ఇక పార్టీకి సరైన గుర్తింపే ఉండదని.. నిర్వీర్యం అయిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.