ఈటల రాజేందర్ సొంత పార్టీ దిశగానే కదులుతున్నారు. ప్రభుత్వం తనపై ఎంత అణిచివేతకు పాల్పడితే అంత మంచిదని భావిస్తున్నారు. అందుకే కాస్త దూకుడైన ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు ఈటల ఇప్పటికే ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు. తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని… ఇక ఆత్మగౌరవం, ఆత్మాభిమాన పోరాటమేనని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ బానిసత్వం వైపు తీసుకెళ్తున్నారని.. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని ఈటల చెబుతున్నారు. భవిష్యత్‌లో విజయం వైపు ప్రయాణం చేస్తానని ధీమాగా చెబుతున్నారు.
ఈటలకు వ్యూహాత్మక మద్దతు లభిస్తోంది. ఆయన కోసం ముదిరాజ్ సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆదరణ లభించని నేతలు ఇప్పుడు ఈటల వైపు చూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతను అవమానకరంగా బయటకు పంపుతున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితిని టీఆర్ఎస్ హైకమాండ్ ఊహించలేకపోయింది. మహా అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం రెస్పాన్స్ ఉంటుందని.. ఆయన రాష్ట్ర స్థాయి నేత కాదన్నట్లుగా టీఆర్ఎస్ హైకమాండ్ ఉంది. కానీ ఇప్పుడు… అన్ని నియోజకవర్గాల్లోనూ.. కొంత కదలిక కనిపిస్తోంది.
అయితే… ఈటల రాజేందర్ ఒక్కటే కాకుండా.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ఇప్పుడు ఆయనతో టచ్‌లోకి వెళ్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్లో ఇప్పుడు అంతా బంగారు తెలంగాణ పేరుతో పార్టీలో చేరి పదవులు అనుభవించిన వారే ఎక్కువ ఉన్నారు. చివరికి.. ఈటలను మేకవన్నె పులి అని తిట్టిన గంగుల కమలాకర్.. ఉద్యమసమయంలో టీడీపీలో ఉన్నారు. కేసీఆర్ వెంట నడవలేదు. అలాంటి వారితో ఈటల తిట్టించడంతో… సెంటిమెంట్ మరింత పెరిగింది. ఇప్పుడు.. తెలంగాణ ఉద్యమకారుల ఆస్తి అన్నట్లుగా సెంటిమెంట్‌గా మార్చాలని ఈటల వ్యూహం పన్నారు. అందుకే మరో ఉద్యమం.. ఆత్మగౌరవం పేరుతో నినాదాలు మొదలు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు.