బెంగాల్ రాజకీయ హింసను బీజేపీ.. కరోనా సమయంలోనూ జాతీయ విపత్తుగా ప్రచారం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అన్నింటికీ.. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని నిందిస్తూ.. హిందువులపై దాడులంటూ.. బీజేపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్వయంగా .. బెంగాల్ గవర్నర్కు ఫోన్ చేసి .. తన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హూటాహటిన బెంగాల్ పోయి కార్యకర్తల్ని పరామర్శించి వచ్చారు. కరోనా కాలంలోనూ అన్ని రాష్ట్రాల్లో బెంగాల్ హింసకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో నేతలు.. ప్రెస్మీట్లు.. ట్వీట్లతో నిరసన తెలిపారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఈ విషయంలో.. మమతా బెనర్జి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి వ్యవస్థను ఎవరు నడుపుతున్నారో చెప్పాలని నేరుగా గవర్నర్నే ప్రశ్నించారు. మూడు నెలలుగా బెంగాల్లో పాలన ఈసీ చేస్తోంది. డీజీపీ తో సహా… కీలకమైన అధికారులందర్నీ మార్చేసింది. వారెవరూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట వినేవాళ్లు కాదు. అదే విషయాన్ని చెప్పి… తాను ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి తనదే బాధ్యతని స్పష్టం చేశారు. అంతే కాదు.. అలా ప్రమాణస్వీకారం చేయగానే.. ఇలా డీజీపీని మార్చేశారు. ఎన్నికల హింసను ఆపడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే ముందు నుంచీ… బీజేపీ బెంగాల్ లో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అమలు చేయడంతో… సానుభూతి రాకపోగా… విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆంధ్రలో జరుగుతున్న రాజకీయ హింస గురించి బీజేపీకి తెలియదా… ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం లేదని.. కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బీజేపీ బెంగాల్ విషయంలో చేస్తున్న రాజకీయం సానుభూతి కన్నా విమర్శల్నే ఎక్కువ తెచ్చి పెడుతోంది.