పోలీసు శాఖకు తలవంపులు తెచ్చారని ఓ అధికారిపై డీజీపీ చర్యలు తీసుకుంటే… ఆ చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రభుత్వం కొట్టేసింది. ఈ అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇక్కడ డీజీపీ కూడా పోలీసు శాఖకు తలవంపులు వచ్చాయని హైకోర్టు చెబితేనే చర్యలు తీసుకున్నారు. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తీసుకున్న చర్యల్ని కూడా ప్రభుత్వం లైట్ తీసుకునికొట్టి వేసింది. అసలేం జరిగిందంటే… కొన్నాళ్ల క్రితం… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా వైసీపీ నేతలు అడ్డగించారు. ఆ సమయంలో చంద్రబాబు వెనక్కి వెళ్లిపోవాలంటూ… పోలీసులు ఒత్తిడి చేశారు.
అనుమతి ఉన్నా ఎందుకు వెళ్లాలంటున్నారని చంద్రబాబు ప్రశ్నించడంతో.. అప్పటికప్పుడు.. ఓ కాగితంపై.. చేత్తో నోటీస్ రాసి ఇచ్చారు. ఇలా రాసి ఇచ్చింది స్వరూపారాణి అనే పోలీసు అధికారిణి. ఆ నోటీసును తీసుకుని వెనక్కి వెళ్లిన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు పోలీసులు అధికారులు తప్పిదానికిపాల్పడ్డారని నిర్ధారించి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. చాలా కాలం పాటు.. ఏ చర్యలూతీసుకోని డీజీపీ.. చివరికి నోటీసు ఇచ్చినఅధికారిపై పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారని నిర్ధారించి.. రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు కత్తిరిస్తూ… చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పునంసమీక్షించాలని ఆమె… ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఆ రోజు చంద్రబాబును అడ్డుకునే వ్యవహారం అంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగింది కాబట్టి.. ఆమె చర్యలకు గురి కావడం ఏమిటనుకున్నారో ఏమో… రాష్ట్ర హోంశాఖ నుంచి ఆమెపై చర్యల్ని కొట్టి వేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అంటే.. ఇక్కడ హైకోర్టుతో పాటు… డీజీపీ ఆదేశాలు కూడా.. చివరికి కొట్టివేతకు గురయ్యాయన్నమాట. రాజకీయ బాసులు చెప్పినట్లుగా చేసే పోలీసులకు … ప్రభుత్వం అండ ఉంటుందని ఈచర్యల ద్వారా నిరూపించినట్లయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.