ఇటీవలి కాలంలో సినీ హీరోలు స్థాపించిన పార్టీ ల అన్నింటి భవిష్యత్తు ఒకేలా ఉంటోంది. ఎన్నికల వరకు అనేక మంది పార్టీ లో చేరడానికి ఉవ్విళ్లూరడం, ఆ పార్టీ ఏమో ఎన్నికల్లో మట్టి కరవడం, పార్టీ ఓడిపోయిందని తెలియగానే చేరిన వాళ్ళంతా తమ దారి తాము చూసుకోవడం, వెళ్తూ వెళ్తూ పార్టీ అధినేత మీద రాళ్ళు విసిరి వెళ్లడం – చిరంజీవి పార్టీ, విజయ కాంత్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ తో పాటు ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ పరిస్థితి కూడా ఇదేలా ఉంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ పార్టీ అసలు మనుగడ సాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది . వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. ఎంఎన్ఎం గా పిలువబడే ఈ పార్టీ తాజా ఎన్నికలలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పార్టీ అధ్యక్షుడు సైతం బిజెపి నేత వానతి శ్రీనివాసన్ అనే మహిళ చేతిలో ఓటమి పాలయ్యారు. ఏరి కోరి డీఎంకే అభ్యర్థి అటు అన్నా డీఎంకే అభ్యర్థిని పోటీలో లేని నియోజకవర్గాన్ని ఎంచుకున్నా కూడా ఓటమి తప్పలేదు. అయితే పార్టీ ఓడిపోయిందని తెలియగానే పార్టీ నేతలు పార్టీకి రాజీనామా సమర్పించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు వరుస బెట్టి రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర సైతం రాజీనామాను సమర్పించడమే కాకుండా వెళ్తూ వెళ్తూ ఒక లేఖ రాసి ఆ లేఖలో అధ్యక్షుడు కమల్ హాసన్ పై బురద చల్లారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదంట, కమల్ హాసన్ ని ఆయన సలహాదారులు పక్క దారి పట్టిస్తున్నారు అట, కమల్ హాసన్ విభజించి పాలించు పద్ధతిని అమలు చేస్తున్నారట. లేఖలో ఆయన రాసిన అంశాలు ఇవి. అయితే నెటిజన్లు మాత్రం ఓడిపోయిన పార్టీ కి ఇది సాధారణమే అంటూ కమల్ హాసన్ కు మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల ముందు ఎగబడి వచ్చిన నాయకులే ఎన్నికలు అయిపోగానే ఈ విధంగా ప్రవర్తించడం రాజకీయాల్లో సాధారణమే అని, ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే వారే కమల్ హాసన్ ని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే వారని వారంటున్నారు. అయినా కమల్ హాసన్ లోని లోపాలు వారికి ఇప్పుడే తెలుస్తున్నాయా, ముందు తెలీవా అని వారు ప్రశ్నిస్తున్నారు
అయితే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మనుగడ సాగించడం చాలా కష్టం. ప్రత్యేకించి ఆర్థిక వెన్ను దన్ను లేని పార్టీలకు ఇది మరింత కష్టం. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తాను నమ్ముకున్న విలువలకు నాయకుడు నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తే మీడియా బలం, ఆర్థిక బలం లేకపోయినా ఏదో ఒక నాటికి ఆ పార్టీ ఖచ్చితంగా గణనీయమైన స్థానాన్ని పొందగలుగుతుంది. మరి ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని నిలబెట్టుకో గలిగే దమ్ము కమల్ హాసన్ కి ఉందా, 66 ఏళ్ల లోక నాయకుడు పోరాట పటిమ ను కనపరచి పార్టీని నిలబెట్టుకుంటాడా అన్నది వేచిచూడాలి.
కొస మెరుపు: ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాల నుండి విరమించుకుని రజినీకాంత్ మంచి పని చేశాడని, పైగా ఇటీవలే ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిందని, ఒక వేళ పోటీ చేసి ఉంటే రజనీకాంత్ పరిస్థితి కూడా ఇంత కంటే భిన్నంగా ఉండే అవకాశం లేదని, దశాబ్దాలు గా కూడ బెట్టుకున్న పరువు, పేరు మొత్తం ఒక ఎన్నిక తో రజనీకాంత్ కూడా కోల్పోయి ఉండేవాడని, వాటన్నింటినీ తప్పించుకుని రజనీ కాంత్ మంచి పని చేశాడని ఇప్పుడు తమిళనాట చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం.