ఆంజనేయుని జన్మస్థలం తిరుమల అంజనాద్రేనని… ఆధారాలు బయట పెట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. దీనిపై అప్పుడే దేశవ్యాప్త చర్చ జరిగింది. ఆంజనేయుని జన్మస్థలాలుగా ఇప్పటికే పేరున్న ఆయా దేవాలయాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం రాను రాను.. పెద్దది అవుతోంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే ఆంజనేయుని జన్మస్థలంగా భక్తులు భావించి.. దర్శించుకునే కర్ణాటకలోని కిష్కింధ దేవస్థానం అధికారులు ఓ ఘాటు లేఖ పంపారు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసిన కిష్కింధ దేవస్థానం పండితులు… అజ్ఞానపు,మూర్ఖపు పనులు చేయవద్దని హితవు పలికారు.
మీ కమిటీ నివేదిక అభూతకల్పనని మేము నిరూపిస్తామని..వెంటనే తమ లేఖకు సమాధానం ఇవ్వాలని వారు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దివ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ ప్రసిద్ధిని కాపాడాల్సిన టీటీడీ పెద్దలు కొత్తగా చరిత్ర కారులు ఎవరూ చెప్పకుండానే.. ఎలాంటి ప్రతిపాదిక లేని ఆధారాలతో.. ఆంజనేయుని జన్మస్థలం కూడా తిరుమలే అని ప్రకటించుకోవడానికి కారణాలేమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇది పూర్తిగా తిరుమలను అవమానించడమే అన్న చర్చ జరుగుతోంది. నిజంగా తిరుమలనే ఆంజయనేయుడి జన్మస్థలం అయితే… ఏకపక్షంగా ప్రకటన చేయడం… మూర్ఖత్వం.
ఎలాంటి వివాదాలు లేకుండా సాక్ష్యాలతో సహా.. సంబధితులందర్నీ ఒప్పించి.. ప్రకటన చేస్తే… శ్రీవారి క్షేత్రానికీ గౌరవం ఇచ్చినట్లుగా ఉండేది. ఇప్పుడు కిష్కింధ దేవస్థానం అధికారులు వాదనకు దిగుతున్నారు. మూర్ఖపు పని చేశారని టీటీడీని నిందిస్తున్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. టీటీడీని వివాదంలోకి నెడుతోంది. ఈ పరిస్థితి తేవాల్సిన అవసరం టీటీడీ అధికారులకు ఎందుకు వచ్చిందనేది.. ఇప్పుడు శ్రీవారి భక్తుల ప్రధాన ప్రశ్న.