ఈటలను టార్గెట్ చేసిన కేసీఆర్ ముందూ వెనుకా ఆలోచించకుండా… దేవరయాంజల్ భూములపై విచారణకు ఆదేశించారు. నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ నియమించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఆకమిటీ కేవలం.. ఈటల కుటుంబానికి చెందిన.. అక్కడ ఉన్న భూములు… గోడౌన్లను మాత్రమే అక్రమంగా ప్రకటించి.. కూలగొట్టేలా నివేదిక సిద్ధం చేసి పని పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు.. ఆ భూములకు సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. దేవాలయానికి చెందినట్లుగా చెబుతున్న భూముల్లో అత్యధికం టీఆర్ఎస్ నేతల చేతుల్లో ఉన్నాయి. స్వయంగా కేటీఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రాలు కూడా బయటకు వచ్చాయి.
రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి.. పత్రాలు బయట పెట్టడమే కాదు.. నిజనిర్ధారణ అంటూ.. ఆ ప్రాంతానికి వెళ్లి.. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఉన్న గోడౌన్‌ను కూడా పరిశీలించారు. అలాగే.. కేసీఆర్ బంధువులు ఎంత మందికి భూములు ఉన్నాయో.. అన్నింటినీ లెక్కలు బయట పెట్టారు. ఈటల మీద విచారణ చేసినట్లుగానే అక్కడ వివాదాస్పద భూములు కలిగి ఉన్న ప్రభుత్వంలోని మంత్రులు, టీఆర్ఎస్ నేతలందరి మీద సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారినికూడా మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ నేత సంపత్ కుమార్.. మొత్తం టీఆర్ఎస్ నేతలపై ఉన్న భూకబ్జా ఆరోపణలన్నింటినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
రేవంత్ ఆరోపణలపై టీఆర్ఎస్ ఇంత వరకూ స్పందించలేదు. మామూలుగా అయితే.. రేవంత్ స్పందించగానే ఒంటి కాలి మీద లేవడానికి బాల్క సుమన్ లాంటి వాళ్లకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. కానీ ఈ సారి బాల్క సుమన్ కూడా… నోరు తెరవలేదు. ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌ల కమిటీ ఇంత వరకూ ప్రాథమిక రిపోర్ట్ కూడా సమర్పించలేదు. ఈటల అక్రమనిర్మాణాలు చేపట్టారని మీడియాకు లీక్ చేస్తున్నారు కానీ.. అసలు ఆ భూముల్లో ఉన్న గోడౌన్ల కథేమిటో చెప్పడం లేదు. ఈటల భూములపై రిపోర్ట్ ఇస్తే.. అది కోర్టుకు చేరి.. పూర్తి స్థాయి విచారణకు దారి తీస్తే… అంతా టీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకుంటుందని అనుమానిస్తున్నారు. అందుకే ఇక ఈటల విషయంలో భూఆక్రమణల ఎపిసోడ్‌ను సైలెంట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.