ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించిందుకు జార్ఖండ్ సీఎంపై జగన్ విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్‌కు ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ ట్వీట్ సూపర్ వైరల్ అయింది. చర్చోపచర్చలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్‌గా ప్రధానమంత్రికి మద్దతు తెలుపుతూ… మరో సీఎంపై విరుచుకుపడటం… అందరికీ కొత్తగా అనిపించింది. సరికొత్త రాజకీయ వ్యవస్థను… నైతిక విలువలను సృష్టించడంలో జగన్ సరికొత్త ఒరఒడి సృష్టిస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే.. ఆయన ట్వీట్‌కు.. సరైన ప్రచారం కల్పించడంలో.. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారో చెప్పడంలో.. సాక్షి మీడియా పూర్తిగా విఫలమయింది. అసలు విఫలమవడం కాదు.. డిజాస్టర్ అయింది.
అసలు జగన్ ట్వీట్‌కు.. సాక్షి పత్రికలో కానీ.. సాక్షి డిజిటల్.. టీవీ మీడియాలో కానీ చోటు దక్కలేదు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ పాలసీలో మొట్ట మొదటి నిబంధన.. జగన్మోహన్ రెడ్డి కాలు కదిలిస్తే వార్త రాయడం. రెండోది… జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవాళ్లపై బురద చల్లడం. రెండో దాన్ని ఎప్పుడూ ఎఫెక్టివ్‌గా చేసే.. సాక్షి జర్నలిజం టీం.. మొదటి దానిలో మాత్రం తరచూ తడబడుతూ ఉంటారు. జగన్ ట్వీట్ వార్తను కవర్ చేయకపోవడంతోనే ఈ విషయం తేలిపోయింది. జగన్‌ను సమర్థించడం కూడా సాక్షి టీంకు చేతకావడం లేదా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి.
జగన్ ట్వీట్ చేశారని అందరికీ తెలుసు. కానీ తెలియనట్లుగా సాక్షి ఉండిపోయింది. బహుశా.. ఆ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్‌కు మచ్చలా పడుతుందన్న ఉద్దేశంతో సాక్షి జర్నలిజం టీం.. ఆ వార్తను “కిల్” కేటగిరిలో చేర్చినట్లుగా ఉన్నారు. నిజంగా అదే అభిప్రాయంతో వార్తను కిల్ కేటగిరిలో చేర్చినట్లయితే.. అది కూడా తప్పుడు స్ట్రాటజీనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ట్వీట్ చేశారని.. అందుకే.. సాక్షి పత్రిక కవర్ చేయలేదన్న అభిప్రాయం అందరికీ వెళ్లిపోతుంది. అదే సమయంలో … ఆ ట్వీట్‌ను కవర్ చేసి.. ఎందుకు అలాచేశారో వివరణ ఇస్తూ.. తమదైన శైలిలో సమర్థించుకుంటే.. జగన్మోహన్ రెడ్డి పరువును కాపాడినట్లయ్యేది. కానీ అలా రాయగల సామర్థ్యం తమకు లేదనుకున్నారో.. అలా రాయడం.. మరింత డ్యామేజ్ చేస్తుందని అనుకున్నారో కానీ.. మొత్తంగా వార్తను ఇగ్నోర్ చేసి.. తప్పుడు సంకేతాలను మాత్రం పాఠకుల్లోకి పంపేశారు.
సాటి ముఖ్యమంత్రిని విమర్శిస్తూ.. జగన్ ఆషామాషీగా ట్వీట్ చేసి ఉండరు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ట్వీట్ పడి ఉంటుంది. జగన్‌తో పాటు మరికొంత మంది బీజేపీ పాలిత.. బీజేపీ సన్నిహిత ముఖ్యమంత్రులు జార్ఖండ్ సీఎం ట్వీట్‌పై స్పందించారు. అంటే… ఓ ప్రణాళిక ప్రకారం.. ఈ ట్వీట్ పడింది. ఆ మేరకు క్రెడిట్ జగన్‌కు ఇవ్వాల్సిందే. కానీ మోడీని సమర్థించి.. సమర్థించలేదని… సైలెంట్‌గా ఉంటే.. అది దొంగాట అవుతుంది. ఆ దొంగాటను సాక్షి ఇట్టే పట్టిచ్చి పరువు తీస్తోంది.