చట్టాలు పాలకుల చేతుల్లో ఎలా చుట్టాలుగా మారుతాయో.. మరో ఉదాహరణ తెలంగాణలో కళ్ల ముందు సాక్ష్యాలతో సహా కళ్ల ముందు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. తెలంగాణలో వామనరావు అనే లాయర్‌తో పాటు.. న్యాయవాది అయిన ఆయన భార్య కూడా .. పట్ట పగలు నడి రోడ్డుపై దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసులో అన్ని వేళ్లూ.. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వైపే చూపించాయి. చాలా నేర ప్రవర్తి ఉన్న ఆయన .. లాయర్ దంపతుల హత్యకు రింగ్ మాస్టర్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. చనిపోయిన లాయర్ దంపతుల తండ్రి కూడా పుట్ట మధుపై ఫిర్యాదు చేశారు. కానీ టీఆర్ఎస్‌లో కీలక నేత కావడంతో ఈగ వాలలేదు. స్వయంగా పుట్ట మధు బావమరిది ప్రమేయంపై సాక్ష్యాలు దొరికినా … పుట్ట మధు జోలికి మాత్రం వెళ్లలేదు.
నిజానికి పుట్ట మధు అనే నేతపై వామనరావు దంపతులు పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నారు. ఆయన అక్రమాస్తులపై కేసులు వేశారు. ఈకారణంగానే హత్య చేశారనేది ప్రధానంగా ఉన్న అభియోగం. అయితే టీఆర్ఎస్ నేత అయిన కారణంగా ఆయనపై ఈగ వాలలేదు. జబర్దస్తీగా అప్పట్లో ప్రెస్‌మీట్ పెట్టి.. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని చాలెంజ్ కూడా చేశారు. అంతగా ధీమా పొందిన పుట్టమధును హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే.. ఆయనకు టీఆర్ఎస్‌తో తేడా వచ్చింది. పుట్ట మధు ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు. ఈటల రాజేందర్ కుమారుడితో కలిసి పుట్ట మధు వ్యాపారాలు చేస్తున్నారు. ఎలా చూసినా ఆయన ఈటల వర్గమే అవుతారనుకున్న ప్రభుత్వ పెద్దలు ఆయనను టార్గెట్ చేశారు. వారం రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నారేమో తెలియదు కానీ.. ఆయన అదృశ్యమయ్యారని కలకలం రేగిన తర్వాత అరెస్ట్ చూపించారు. ఈ వారం రోజులు.. ఈటల రాజేందర్.. ఆయనకుమారుడి గుట్టుముట్లు ఏమైనా తెలిస్తే.. బయటకు లాగి ఉంటారేమో కానీ.. ఇప్పుడు…మాత్రం ఆ లాయర్ దంపతుల హత్య కేసులో విచారించడం ప్రారంభించారు.
రేపోమాపో ఆయనపై సాక్ష్యాలున్నాయని అరెస్టు చూపినా ఆశ్చర్యం లేదు. నిజానికి ఇక్కడ మనం చూడాల్సింది రాజకీయ కోణం కాదు. చట్టం ప్రకారం.. లాయర్ దంపతుల హత్య లాంటి సీరియస్ కేసులోనూ.. రాజకీయ పార్టీ పరంగా బలం చూసుకుని.. రిలీఫ్ పొందిన వ్యక్తి.. ఇప్పుడు ఆ పార్టీ విశ్వాసం కోల్పోయినందున కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. అంటే అధికార పార్టీలో ఉంటే.. హత్యల్లాంటివి చేసినా.. చట్టం చుట్టంగా మారిపోతుందన్నమాట. వ్యవస్థలో ఉన్న ఈ లోపాలే..ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదంగా మారుతున్నాయి.