ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ లేని కారణంగా ఒక్కరు కూడా మృతి చెందకూడదన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఉన్న పళంగా రూ. 310 కోట్లను.. ఆక్సిజన్ అవసరాల కోసం కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల వరకూ వీటిని ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఈ సొమ్ముతో 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ టాంకర్ల కొనుగోలు చేస్తారు. అలాగే 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లకు పైప్లైన్లను ఏర్పాటు చేస్తారు.
సివిల్, ఎలక్ట్రికల్ పనులకు, 10వేల ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటుకు..వాటితో పాటు.. ఆక్సిజన్ పైప్లైన్ మెయింటెనెన్స్కు జిల్లాకు నెలకు 10 లక్షలు చొప్పున.. కేటాయిస్తారు. అదే సమయంలో.. తమిళనాడు, కర్ణాటక నుండి ఏపీకి సరఫరా అవుతున్న లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ను నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆక్సిజన్ పంపిణీని కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడంతో స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ.. కావాల్సినంతగా ఆక్సిజన్ రావడం లేదు.
కేంద్రం ఒడిషా, బళ్లారిల నుంచి ఆక్సిజన్ కేటాయించింది. అక్కడ్నుంచి తెప్పించుకోవడం సమస్యగా మారింది. ట్యాంకర్ల కొరత ఉంది. దీంతో.. ఉన్న పళంగా.. ట్యాంకర్లను కొనుగోలు చేసి.. ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది. కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది.