చంద్రబాబు కర్నూలులో N-440K రకం వైరస్ కర్నూలులో పుట్టిందని చెప్పారని దాని వల్ల ప్రజలు భయాందోళనలకు గురై చనిపోతున్నారని.. ఓ లాయర్ ఫిర్యాదు మేరకు వెంటనే…కేసు పెట్టేసి.. అరెస్ట్ చేయడానికి రెడీ అంటూ.. హడావుడి చేస్తున్నారు కర్నూలు పోలీసులు. అయితే.. చంద్రబాబు చెప్పని దాని కన్నా ముందే… ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. కర్నూలులో N-440K రకం వైరస్ని ప్రభుత్వం గుర్తించిందని తగు చర్యలు తీసుకుంటున్నామని ఓ టీవీ చానల్ డిబేట్లో ప్రకటించారు. ఆయన అధికారంలో ఉన్న మంత్రి. ప్రభుత్వం గుర్తించింది అని చెప్పడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని.. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ… ఆధారాలతో సహా.. కర్నూలులో రవికుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవాలను వక్రీకరించి.. మరీ అప్పలరాజు వైరస్ గురించి ప్రచారం చేశారని తక్షణం ఆయనపై ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరారు. చంద్రబాబుపై పెట్టిన కేసు కూడా అలాంటిదే. ఇప్పుడు సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా అన్నది చాలా మందికి ఆసక్తికరంగానే ఉన్నా… అసలు అలాంటి అవకాశమే లేదని.. ఇప్పటి వరకూ పోలీసులు అనుసరిస్తున్న.. ఆచరిస్తున్న చట్టమని సులువుగా అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. నేరం అంటూ.. టీడీపీ నేతలపై ఏ అభియోగాలతో కేసులు పెడతారో.. అలాంటివే వైసీపీ నేతలు చేసినట్లుగా.. పక్కా సాక్ష్యాలతో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా ఇంత వరకూ ఎప్పుడూ కేసులు పెట్టిన పాపాన పోలేదు.
చట్టం కేవలం టీడీపీ నేతలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లుగా ఉండటమే దీనికి కారణం. పోలీసులు ఈ విషయంలో… సీదిరి అప్పలరాజుపై కేసులు నమోదు చేసే ధైర్యం పోలీసులకు ఉంటుందా.. లేకపోతే.. చంద్రబాబుపై రాజకీయ కోసమంలోనే కేసులు పెట్టామని నిరూపించుకుంటారో.. వేచి చూడాల్సి ఉంది. ఒక వేళ… అప్పలరాజుపై కేసులు పెట్టకపోతే ప్రజల దృష్టిలో పోలీసు ఇమేజ్ మరింత చులకన అవుతుంది. కోర్టుల మొట్టికాయలు కూడా తినాల్సి రావొచ్చు.