మధ్యలో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను విదేశాల్లో అయినా నిర్వహించి తీరాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. ఇప్పటికిప్పుడు ఆ టోర్నీని రద్దు చేస్తే.. జరిగే నష్టం.. రెండున్నర వేల కోట్లుగా తేలింది. ఇంత నష్టాన్ని భరించడం కన్నా.. ఏదో విధంగా టోర్నీ నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే… తగ్గేలా లేదు.. ధర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండియాలో టోర్నీ కొనసాగించడం అసాధ్యం. ఒక వేళ కంట్రోల్ అయినా… ఈ సీజన్లో ఆటగాళ్లు ఇండియాకు రావడానికి ఇష్టపడరు.
అయితే బీసీసీఐకి.. ఆశాకిరణంలాగా ఇతర దేశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇండియాలోనే సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఇతర దేశాల్లో లేదు. తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని ఇంగ్లాండ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో శ్రీలంక కూడా ఆఫర్ ఇచ్చింది. ఇండియా నుంచి వెళ్లే ఆటగాళ్లను మాత్రం… ప్రత్యేకంగా టెస్టులు చేసి.. రెండు వారాల క్వారంటైన్లో ఉంచి.. బయోబబుల్ కొనసాగించి.. ఆటగాళ్లను విదేశాలకు తీసుకెళ్లగలిగితే.. ఐపీఎల్ నిర్వహించడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చాలా దేశాలు ఇండియా నుంచి ఏ ప్రయాణికుల్నీ రానివ్వడానికి అంగీకరించడం లేదు.
ఐపీఎల్ కు అంగీకరిస్తే.. ఆటగాళ్లకు మాత్రం ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ ఎప్పుడూ మధ్యలో ఆగిపోలేదు. ఇప్పుడు.. ఆగిపోకూడదని బయట అయినా నిర్వహించాలని అనుకుంటోంది. వేల కోట్లతో ముడిపడిన వ్యవహారం కాబట్టి… తల్చుకుంటే అయిపోతుందని.. కొంత మంది తేల్చేస్తున్నారు.