ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్యశాఖను తీసేసుకున్న తర్వాత ఆ శాఖను పట్టించుకునేవారు లేకుండా పోయారని.. కరోనా కాలంలో ప్రజల్ని గాలికి వదిలేశారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు… సీఎం కేసీఆర్ ఒకే ఒక్క సమీక్షతో ధనాధన్ సమాధానం చెప్పారు. ఆదివారం సుదీర్ఘంగా.., రాత్రి పొద్దు పోయే వరకూ సమీక్షలు జరిపి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు, మూడు నెలల కాలానికి యాభై వేల మంది వైద్యులను నియమించాలని.. డిసైడయ్యారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారందరూ.. దరఖాస్తు చేసుకోవాలని.. కరోనా విజృంభణను అడ్డుకోవడానికి వైద్య పరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తీసుకునేవారు రెండు, మూడు నెలల కాలానికే పనిచేయాల్సి ఉంటుంది.
ఎంత కాలం అన్న సంగతి తర్వాత ముందుగా.. అసలు యాభై వేల మంది డాక్టర్లు దొరుకుతారా… అన్నది పెద్ద సందేహం. యాభై వేల మంది కాదు.. కనీసం రెండు వేల మంది డాక్టర్లు కూడా.. పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నా… రాని పరిస్థితి ఉంది. అలాంటిది కేసీఆర్ ఎలా అంచనా వేశారో కానీ.. ఏకంగా యాభై వేల మంది వైద్యులనేశారు. బహుశా వైద్యల కేటగిరిలోనే ఇతర వైద్యసిబ్బందిని చేర్చి ఉంటారు. అయితే మిగిలిన మెడికల్ స్టాఫ్ కూడా.. ఇప్పుడెవరూ ఖాళీగా లేరు. ఫుల్ డిమాండ్ మీద రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ రెండు నెలల కాలానికి ఉద్యోగమిస్తామని చెబితే.. ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో కేసీఆర్ వైద్యా ఆరోగ్య శాఖను చూస్తున్న సందర్భంగా వరంగల్ , ఆదిలాబాద్‌లలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆయా ఆస్పత్రులకు.., ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సిందిన రూ. ఇరవై ఎనిమిదికోట్లను వెంటనే చెల్లించాలని అక్కడికక్కడ ఆర్థిక శాఖనూ ఆదేశించారు. కేసీఆర్ ఎప్పుడు కీలకమైన సమీక్ష చేసినా ఇలాంటి ఆదేశాలే వెల్లువెత్తుతాయి.
కానీ.. అమలు ఎంత వరకూ అనేది మాత్రం… తర్వాత తరవాత తేలుతుంది. కానీ అప్పటికి జనం మర్చిపోతారు. మరో విశేషం ఏమిటంటే.. కేసీఆర్ ఇలా వైద్య ఆరోగ్యశాఖ తీసుకుని కేంద్రంతో రాష్ట్ర అవసరాలు చెప్పి.. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేయగానే.. ప్రధానమంత్రి మోడీ స్పందించారు. కేసీఆర్ అద్భుతమైన సలహాలు ఇచ్చారని.. వాటిని అమలు చేస్తామని చెప్పారని సీఎంవోనే ప్రకటనలో తెలిపింది. మొత్తానికి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖ తీసుకున్న తర్వాత కేసీఆర్.. ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేసి… దూసుకెళ్తున్నారని టీఆర్ఎస్ నేతలు… సంతోషం ఫీలవుతున్నారు.