ఎకనమిక్స్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్. అర్థం చేసుకుంటే తప్ప.. ఆర్థం కాదు. బట్టీ పడితే అసలు బుర్రకెక్కదు. అలాంటిది.. ఏదేదో చదివేసి.. అర్థశాస్త్రం పాఠాలు చెబితే .. ఎవరికైనా అర్థమవుతుందా..!?. అసలు అర్థం కాదు. కానీ విచిత్రంగా అదే పని చేస్తున్నారు.. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. పన్నులు రద్దు చేస్తే.. రేట్లు పెరుగుతాయట. ఆర్థిక మంత్రి ట్విట్టర్ నుంచి ఈ వాదన వినిపించిన తర్వాత చాలా మంది జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. అలా చెప్పడానికి ఆమె లాజిక్ ఆమె చెప్పవచ్చు కానీ.. నియంత్రణ ఆమె చేతుల్లో ఉన్నప్పుడు… లాజిక్కులు అన్నీ కారణాలుగానే మిగిలిపోతాయి.
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితుల్లో ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివిర్.. వ్యాక్సిన్లు వంటి వాటిపై పన్నులు తీసేయాలని… బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై … నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. పన్నులు తీసేస్తే.. ధరలు పెరుగుతాయని.. అందుకే పన్నులు తగ్గించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పన్నులు తగ్గిస్తే.. ధరలు తగ్గుతాయి కానీ ఎలా పెరుగుతాయన్న సందేహం.. నిర్మలా సీతారామన్‌కు కూడా వచ్చింది. పన్నులు తగ్గిస్తే… ఆయా ఉత్పత్తులకు ముడి సరుకులు సరఫరా చేసే వారు ధరలు పెంచుతారట. అంటే.. ఇప్పుడు.. పన్నులు ఉండటం వల్లే వారు తక్కువగా సరఫరా చేస్తున్నారనేది.. ఆర్థిక మంత్రి వారి లాజిక్.
ప్రతి ఒక్క బడ్జెట్లో పన్నులు తగ్గిస్తూ ఉంటారు. కొన్నింటిపై పెంచుతూ ఉంటారు. అందుకే తగ్గేవి.. పెరిగేవి పేరుతో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పిన సూత్రం ప్రకారం.. పన్నులు తగ్గించేది రేట్లు పెంచడానికన్నమాట. మొత్తంగా.. దేశంలో పాలన ఎలాంటి వారి చేతుల్లో ఉందో.. ఇలాంటి మాటల ద్వారా అప్పుడప్పుడూ సర్టిఫికెట్లు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే నిర్మలా వాదనే కరెక్ట్ అని వాదించడానికి ఆర్థిక వేత్తలు… చాలా మంది ముందుకు రావొచ్చు. దానికి కారణం.. ఆమె ఆర్థిక మంత్రి అవ్వడమే. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాడికి దేశం ఉన్న పరిస్థితి అర్థమైపోతుంది.