తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈటల రాజేందర్‌ను కేసీఆర్ అవమానకరంగా బయటకు పంపేసిన తర్వా.. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారంతా ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ను గద్దె నుంచి దింపే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ పిల్లర్గాలా కనిపిస్తున్నప్పటికీ.. తెర వెనుక కోదండరాం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటలతో సమావేశం జరిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి… యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ.. బీజేపీ కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదని.. రాజకీయవర్గాలకు ఓ అంచనా ఉంది. దీనికి కారణం అటు కాంగ్రెస్‌లో కొంత మంది.. ఇటు బీజేపీలో కొంత మంది టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉండి.. సొంత పార్టీని ఎదగకుండా చేయడానికి వారు వ్యూహాలు పన్నుతూండటమే. ఈ కారణంగానే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ వారికి చాన్సిచ్చారు. ఈటల రాజేందర్ కంటే ముందే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి .. కొత్త పార్టీ ప్రస్తావన తీసుకు వచ్చారు. నిజానికి కొండాకు కొత్త పార్టీ పెట్టేంత జనబలం లేదు. ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. రేవంత్ ప్లాన్‌ను కొండా అమలు చేస్తున్నారని అనుకుంటున్నారు.
అదే సమయంలో ఈటల రాజేందర్‌పై కేసీఆర్ వేటు వేశారు. ఇప్పుడు ఈటల కూడా వీరితో జమకూడే అవకాశం కలిగింది. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న నినాదంతో .. ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న వీరు.. జేఏసీ చైర్మన్ కోదండరాంనూ… తమతో పాటు నడిచేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోదండరాం ఇలా .. నలుగురు ప్రముఖులు తెలంగాణ కోసం కొట్లాడినట్లుగానే… ఇప్పుడు.. దొర నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్న నినాదంతో ఉద్యమం ప్రారంభిస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్లో అంతర్గత పరిస్థితి కూడా ఏమంత బాగోలేదన్న అభిప్రాయంతో కేసీఆర్ ప్రత్యర్థులు ఉన్నారు. కొంత మంది మంత్రులు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని.. గట్టిగా నమ్ముతున్నారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తాయని..ఆ నలుగురు ధీమాతో ఉన్నారు. వారే ఆ పరిణామాలను సృష్టించనుండటమే దీనికి కారణం కావొచ్చు.