తుమ్మల నరసింహారెడ్డి అంటే ఎవరికీ తెలియదు. .. కానీ టీఎన్ఆర్ అంటే.. తేలియని వారు ఉండరు. చాలా సహజమైన జర్నలిజంతో.. సినీ ప్రముఖుల్ని ఇంటర్యూలు చేసే టీఎన్ఆర్.. యూట్యూబ్‌లో స్టార్ ఇంటర్యూయర్. ఆయన తమను ఇంటర్యూ చేయాలని ఇండస్ట్రీలోని వారందరూ కోరుకుంటారు. వ్యక్తిత్వ పరంగా కూడా ఎంతో సున్నిత మనస్కుడయిన టీఎన్ఆర్… పరిచయమైన ప్రతి ఒక్కరికీ ఆత్మీయుడే. అందుకే.. ఆయన మరి లేరన్న వార్త తెలిసిన తర్వాత బాధను దిగమింగుకోలేకపోతున్నారు.
కరోనా ఎంతో మందిని కనిపించకుండా చేస్తోంది. కళ్ల ముందు మెదులుతున్న వారే.. ఇక లేరనే చేదు నిజాన్ని నమ్మేలా చేస్తోంది. ఇప్పుడు ఎవర్ని కదిలించినా… ఒకటే బాధ. ఫలానా ఆత్మీయుడ్ని కోల్పోయామన్న ఆవేదనే అందరిలో కనిపిస్తోంది. అది ఒక్క రోజు కాదు.. ప్రతీ రోజూ వెంటాడుతోంది. జర్నలిస్టుకు ఇది మరీ ఎక్కువ. ఇతర రంగాల్లో కన్నా.. ప్రజల్లో తిరిగి వారి క్షేమం కోసం పని చేసే జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడి… ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి జాబితాలో టీఎన్ఆర్ కూడా చేరిపోయారు.
టీఎన్ఆర్ కరోనాకు భయపడలేదు. అలాగని నిర్లక్ష్యం చేయలేదు. కరోనా విస్తృతి ఉద్ధృతమయ్యాక.., వారం రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. అంతే కాదు.. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు వారం రోజుల సెల్ఫ్ లాక్ డౌన్ చాలెంజ్‌ను.. కూడా ఆత్మీయులకు విసిరారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోనే.. కరోనా వైరస్ ఎంతటి ప్రమాదకరమైందో చెప్పడమే కాదు.. దాన్ని ఎదుర్కోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో కూడా మాటల్లో చెప్పారు. ఆయన చివరి వీడియోలోని కాన్ఫిడెన్స్ చూస్తే.. కరోనా ఆయనను ఏమీ చేయలేదని ఎవరైనా అనుకుంటారు. కానీ విధి రాత మరోలా ఉంది.
టీఎన్ఆర్ మృధు స్వభావి. ఆయనకు కుటుంబం అంటే ప్రాణం. కొద్ది రోజుల కిందట… తన సోదరి కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో ఉంటే… కోలుకోవాలని ఎంత తపనపడ్డారో.. ఆయన సోషల్ మీడియా పోస్టులు చూసే వారికి అర్థమవుతుంది. టీఎన్ఆర్ .. అభిలాష ప్రకారమే ఏమో కానీ.. ఆయన సోదరి.. అత్యంత విషమ పరిస్థితి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ.. ఆయనే కరోనా బారిన పడ్డారు.
టీఎన్ఆర్ వ్యక్తిగతంగా తెలిసిన వారు .. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. ఆయన ఇంటర్యూలు చూసి అభిమానించిన వారు.. అయ్యో అనుకోకుండా ఉండలేరు. సోషల్ మీడియాలో ఆయన ఇంటర్యూల కింద వస్తున్న సంతాప సందేశాల రెస్పాన్సే టీఎన్ఆర్ ఫ్యాన్ బేస్ ఎలా ఉందో తెలియచేస్తుంది. అందరూ ఇప్పుడు విషాదంలో నిండిపోయారు. సోషల్ మీడియాలో ఆయన కోసం సెలబ్రిటీలు పెడుతున్న పోస్టులే… ఆయన ఎంత అభిమానం సంపాదించుకున్నారో తెలుస్తుంది. డిజిటల్ శకం… స్మార్ట్ ఫోన్ల యుగం ప్రారంభమైన తరవాత.. ఇంటర్యూలకు స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిన వ్యక్తి టీఎన్ఆర్. ఆయన లేకపోయినా ఆయన ముద్ర మాత్రం ఉంటుంది.