ఈటల రాజేందర్‌ను సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో బలహీనపర్చడానికి కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలన్నింటినీ అమలు చేస్తున్నారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలెవరూ… ఈటల వైపు వెళ్లకుండా… సామ, బేద, దాన దండోపాయాల్ని ప్రయోగిస్తున్నారు. ఈటలకు అత్యంత సన్నిహితులైన పుట్టామధు లాంటి వారిపై ఇప్పటికే.. ఈటల వెంట వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో… ప్రత్యక్షంగా చూపించారు. మరికొంత మందిసొంత పార్టీ నేతలకు … నిధుల దుర్వినియోగం.. అవినీతి అనే ఆరోపణలకు తగ్గట్లుగా నోటీసులు వెళ్లాయి. దీంతో చాలా మంది సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఈటలకు సగం మంది క్యాడర్ బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. దీంతో అందర్నీ దూరం చేసే బాధ్యతను కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అయిన ఈటల, గంగుల మధ్య గతంలో ఎప్పుడూ పెద్దగా విబేధాలు లేవు. ఓ రకంగా ఈటలకే ఎక్కువగా పలకుబడి ఉండేది. ఎందుకంటే.. ఈటల ఉద్యమం నుంచి ఎదిగిన నేత. గంగుల కమలాకర్ టీడీపీ నేత. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. బంగారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్లో చేరారు. పదవుల కోసమే పార్టీ మారారన్న మద్ర గంగులపై ఉంది. ఈ తరుణంలో కేసీఆర్.. ఈటలను బలహీనం చేయడానికి గంగులకే బాధ్యతలు ఇవ్వడం.. సొంత పార్టీ నేతల్లోనే.. కాస్త అయోమయం నెలకొంది. ఇలా చేయడం వల్ల ఈటలకు మరింత సానుభూతి పెరుగుతుందని … గంగులకు బాధ్యతలివ్వడం తప్పిదమేనని అంటున్నారు.
ఈటల మాత్రం.. తన అనుచరులు బహిరంగంగా మద్దతు తెలియచేయడానికి భయపడినా… తర్వాత అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయంలో వారంతా తన వెంటే వస్తారన్న అంచనా లో ఉన్నారు. అందుకే ఆయన.. కోవిడ్ కాలంలో ఎవరూ నేరుగా రావొద్దని అనుచరులు చెబుతున్నారు. గంగుల మాత్రం… హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలందరితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డి అనే నేతను.. టీఆర్ఎస్లోకి తీసుకు వచ్చి.. ఈటలకు పోటీగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఉద్యమకారుడైన ఈటలకు.. బీటీ బ్యాచ్ ద్వారా పదవులు అనుభవిస్తున్న గంగుల చెక్ పెడితే.. గొప్ప విజయమే అవుతుందని టీఆర్ఎస్ నేతలే గొణుక్కుంటున్నారు.