ఎంత కట్టడి చేసినా తాము పన్ను కట్టకుండా ఆపలేరని రియల్ టాక్స్ పేయర్స్ నిరూపిస్తున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన మరుక్షణం… ప్రభుత్వం ఎక్కడ ఆదాయానికి ఇబ్బంది పడుతుందని అనుకున్నారో ఏమో కానీ.. ప్రతి మద్యం దుకాణం ముందు.. లైన్లలో నిలబడ్డారు. హైదరాబాద్లో కనీసం.. ఒక్కో దుకాణం ముందు అర కిలోమీటర్ క్యూ కనిపించింది. జేబులో…. కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉంటే.. అంతకు కొనుగోలు చేసి.. ఇంటికి తీసుకెళ్లి స్టాక్ పెట్టుకోవడానికి మందు బాబులు ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో … చాాల వరకూ మద్యం దుకాణాల్లో స్టాక్ అంతా అయిపోయింది. నాలుగైదు రోజుల పాటు జరిగే అమ్మకాల మొత్తం.. ఈ మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఉంటుందని అంచనా.
నిజానికి.. తెలంగాణలో గత ఏడాదిలా సంపూర్ణమైన లాక్ డౌన్ ప్రకటించలేదు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకూ అనుమతి ఇచ్చారు. అంటే.. మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఉంటుంది. వారు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ అమ్మకాలు కొనసాగించవచ్చు. ఈ మేరకు.. ప్రభుత్వం.. ప్రత్యేకంగా ప్రకటన కూడా చేసింది. అయినప్పటికీ..ఆ నాలుగు గంటలలో కొనుక్కోలేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకున్నారేమో కానీ.. మద్యం దుకాణాల ముందు బారులు తీరారు.
నిజానికి ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాల్ని ఆపేయాలని అనుకునే పరిస్థితి లేదు. ఎంత వీలైతే అంత ఎక్కువ సేపు.. మద్యాన్ని అమ్మకానికి పెట్టాలనే అనుకుంటుంది. ఎందుకంటే… మద్యమే ప్రధాన ఆయన వనరు అయిపోయింది రాష్ట్రాలకు. అయినా మందు బాబుల టెన్షన్ మాత్రం మందు బా బులదే. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్లు.. కర్ఫ్యూలు పెట్టిన అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి.